iDreamPost
android-app
ios-app

నాటకీయ పరిణామాల్లో రాజ్యసభ ఫలితాలు: మూడు బిజెపి, ఒకటి కాంగ్రెస్ గెలుపు

నాటకీయ పరిణామాల్లో రాజ్యసభ ఫలితాలు: మూడు బిజెపి, ఒకటి కాంగ్రెస్ గెలుపు

గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు నాటకీయ పరిణామాల మధ్య వెల్లడైయ్యాయి. మధ్య మధ్యలో ఓట్ల లెక్కింపుకు అంతరాయం కలిగి నిలిచిపోయి ఫలితాలు ఎట్టకేలకు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో మూడు స్థానాలను బిజెపి, ఒక స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి.

గుజరాత్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నాలుగింటిలో మూడింటిని గెలుచుకోవాలని బిజెపి ఎప్పటి నుండో వ్యూహాలు రచించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోనేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్ని‌ చేసింది. రాజ్యసభ ఎన్నికల ముందే కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేయించింది. కాంగ్రెస్‌కు దూరం చేసింది. కాంగ్రెస్ కూడా తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. గుజరాత్‌లో బిజెపి తమ ఎమ్మెల్యేలను వేటాడుతుందని భావించిన కాంగ్రెస్ వారిని కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో రిసార్ట్ లో ఉంచింది.

వాస్తవానికి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టీ బిజెపికి రెండు, కాంగ్రెస్‌కు రెండు వస్తాయి. కాని బిజెపి మూడో అభ్యర్థి పోటీలో నిలబెట్టేసరికి ఓటింగ్ అనివార్యం అయింది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేక ఆటంకాలతో నెమ్మదిగా జరిగింది. ఎందుకంటే బిజెపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు సరిగా వేయకపోవడమే ఈ పరిస్థితి నెలకొంది. బ్యాలెట్ పత్రాల్లో ఓటును వేయాల్సిన దగ్గర కాకుండా వేరే చోట వేయడంతో ఈ గందరగోళం నెలకొంది. ఆ రెండు ఓట్లను రద్దు చేయాలని కాంగ్రెస్ పట్టు పట్టింది. కాని బిజెపి దానికి ససేమిరా అన్నది. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆగిపోయి…ఫలితాల వెల్లడి ఆలస్యం అయింది. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బిజెపి అనుకున్న విధంగానే రాజ్యసభ స్థానాలను గెలుచుకుంది.

బిజెపి మూడు స్థానాలను, కాంగ్రెస్ ఒక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. బిజెపి అభ్యర్థులు నరహరి అమిన్, అభయ్ భరద్వాజ్, రామిలా బారాలు గెలిపొందారు. ఒక్కొక్కరికి 36 ఓట్లు పడ్డాయి. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే శక్తిసిన్హ గోయల్ గెలిపొందాడు. భరత్ సిన్హా సోలంకి ఓటమి పొందాడు. శక్తి సిన్హా గోయల్ కు 36 ఓట్లు వచ్చాయి. భరత్ సిన్హాకి 30 ఓట్లు పడ్డాయి. కేవలం ఆరు ఓట్లతో ఓటమి చెందాడు.

అయితే గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికల్లో ఇలా జరగడం ఇదేమీ‌ మొదటిసారి కాదు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పోటీ చేసినప్పుడు కూడా ఇదే తంతు నడిచింది. అప్పుడు కూడా ఓట్ల లెక్కింపు సజావుగా నడవ లేదు. చివరికి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఫలితాలు ఇవ్వవల్సి వచ్చింది. నాటి ఎపిసోడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలిపొందారు.