iDreamPost
iDreamPost
కొన్ని సినిమాలు ప్రకటించినప్పుడు చాలా క్రేజ్ తెచ్చుకుంటాయి. అందులోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళైతే ఆ హైప్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అలా అనుకున్న ప్రతి కథ తెరకెక్కుతుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిదే ఇది కూడా. 1999లో విడుదలైన నరసింహ గుర్తుందిగా. పడయప్పగా తమిళ్ లోనూ ఇది భారీ రికార్డులు నమోదు చేసుకుంది. రజని, రమ్యకృష్ణల పోటాపోటీ యాక్షన్ కి మాస్ బ్రహ్మరథం పట్టింది. నిర్మాతగా ఏఎం రత్నంకు ఎంత లాభం వచ్చిందో గుర్తు చేసుకోవడం కష్టం.
అప్పటికే టాప్ లీగ్ లో ఉన్న దర్శకుడు కెఎస్ రవికుమార్ గ్రాఫ్ డిమాండ్ తో పాటు అమాంతం ఎగబాకింది. ఏఆర్ రెహమాన్ సంగీతం సైతం మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రజని మ్యానరిజమ్స్, స్టైల్ ఓ రేంజ్ లో కిక్ ఇచ్చాయి. నరసింహ వచ్చిన ఐదేళ్ల తర్వాత ఇదే కాంబినేషన్ ని రిపీట్ చేయాలన్న ఉద్దేశంతో రత్నం “జగ్గూభాయ్” అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అయితే ఏదో సాదాసీదా కమర్షియల్ సబ్జెక్టు కాకుండా ఏకంగా రజినీకాంత్ ని జిహాదీ టెర్రరిస్ట్ గా చూపించే స్కెచ్ వేశారు. స్టోరీ కూడా ఓకే అయిపోయింది.
సూపర్ స్టార్ సినిమా అనగానే కేఎస్ రవికుమార్ కూడా ఆనందంగా ఒప్పేసుకున్నాడు. ఫోటో షూట్ చేసి పేపర్లో యాడ్ కూడా ఇచ్చారు. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో రజనిని చూడబోతున్నామన్న ఆనందంలో అభిమానులు ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూశారు. సంగీత దర్శకుడిగా రెహమాన్ సెట్ అయ్యాడు. సాబు సిరిల్ ని లైన్ లో పెట్టేశారు. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలో ఇది పట్టాలు ఎక్కలేదు. ఏవో కారణాల వల్ల ఆపేశారు. బహుశా దీనికన్నా ముందు సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాబా దారుణంగా దెబ్బ తినడంతో మళ్ళీ రిస్క్ చేసే ఆలోచన మానుకున్నట్టున్నారు. ఏదైతేనేం రజనిని టెర్రరిస్ట్ గా చూసే గోల్డెన్ ఛాన్స్ ఆ రకంగా మిస్ అయ్యిందన్న మాట.