iDreamPost
android-app
ios-app

జగన్ అద్భుత పాలన – పవన్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

జగన్ అద్భుత పాలన – పవన్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం

‘తమకు నచ్చినట్టు ఉండగలిగే స్వేఛ్చ, హక్కు స్త్రీలకు ఉన్నాయి, వారి అభిప్రాయాల్ని అందరూ గౌరవించాలి’ – అనే సందేశాన్ని ఇచ్చిన చిత్రం ‘పింక్’ . ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రం 2016లో విడుదలైంది, ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా సాగే ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించింది.

అజిత్ కథానాయకుడుగా ‘నేర్కొండ పార్వై’ పేరుతో తమిళంలోకి ఈ చిత్రం రీమేక్ అయింది, గత సంవత్సరం విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా విజయం సాధించింది. ఇప్పుడు అదే చిత్రాన్ని దిల్ రాజు – బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో, “ఓహ్ మై ఫ్రెండ్’, “ఎంసీఏ” చిత్రాల దర్శకుడు వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో పవన్ కల్యాణ్ (పీకే) నటించబోతున్నారు.

హిందీలో అమితాబ్ బచ్చన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ ఇమేజికి తగ్గట్టుగా కథను మార్చి పాటలు, ఫైట్లు కూడా జోడించబోతున్నారని ఈ రోజు ‘ఈనాడు’లో వార్త వచ్చింది. ఒక ఇంగ్లీష్ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం పీకే రెండు సినిమాల చిత్రీకరణలో ఒకే సారి పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. వాటిలో ‘పింక్’ రీమేక్ ఒకటి అని నిర్ధారణ కాగా, మరో చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.

desc_lt_image

2014 ఎన్నికల తర్వాత 2018 వరకు పవన్ కల్యాణ్ నాలుగు సినిమాల్లో నటించగా ఒక దాన్ని మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2018 లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత 2019 ఎన్నికలు ఉన్నందున తన కాల్షీట్లు సినిమా నిర్మాతలకు ఇవ్వలేదు. బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో  జనసేన ఘోరపరాజయం చెందింది. ఆ పార్టీ తరఫున రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు ఒక్కరే గెలవగా, పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల నుంచి ఓడిపోయారు. దాంతో పవన్ కళ్యాణ్ కు తన భవిష్యత్తును రాజకీయంగా లా ముందుకు తీసుకెళ్ళాలో ఒక స్పష్టత వచ్చేసింది. అందుకే ఈ ఐదేళ్ళలో పార్టీని బలపరిచే దిశగా ‘జనసేనకు సైద్ధాంతికంగా(వారి వెబ్ సైట్లో సిద్ధాంతాలు ఉన్నాయి) ఎటువంటి పొంతనా లేని భారతీయ జనతా పార్టీ(భాజపా)తో పొత్తు పెట్టుకునేశారు. ఎప్పటి లాగే ఆయన అభిమానులు కూడా వెంటనే భాజపాకు జై కొట్టి, తమ టీ షర్టుల మీద ఉండే చేగువేరా బొమ్మకు కాషాయం రంగు టోపీ పెట్టేశారు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే – రెండు సినిమాలు ఒకే సమయంలో చిత్రీకరణ జరుపుకోబోతున్నాయంటే భాజపాతో పొత్తుల చర్చల కన్నా ముందే పీకే తన తదుపరి సినిమాలకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది. ఏది ఏమైనా – పీకే సినిమాల్లో నటించబోతుండటం అభిమానులను సంతోషపెట్టే వార్త అని చెప్పచ్చు.

ఎక్కువ శాతం మంది రాజకీయనాయకులు తరచూ మాటలు మారుస్తుండటం, మాట తప్పటం సహజం. కానీ తాను అందరి లాంటి రాజకీయనాయకుణ్ణి కానని, అధికారం తనకు లక్ష్యం కాదని, కేవలం ప్రజల స్వరమై ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తనకు ముఖ్యమని పార్టీ స్థాపించినప్పటి నుంచి పదేపదే చెప్పుకున్నారు పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల్లో తెదేపా భాజపా కూటమి ఇచ్చిన హామీల అమలుకు తనది బాధ్యత అని చెప్పి వారిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలతో  జనసేన జత కట్టింది. అది కూడా – రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక నానుడిని చెప్పి తప్పించుకోవచ్చు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఒక్కటే – పవన్ కల్యాణ్ పోయిన సంవత్సరం నవంబర్లో విశాఖపట్నంలో ఇసుక కొరత మీద లాంగ్ మార్చ్ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అన్న మాట – “ముఖ్యమంత్రి జగన్ అద్భుత పాలన అందిస్తే నేను వెళ్లి సినిమాలు చేసుకుంటాను“. ఎప్పటిలాగే ఈ మాట కూడా ఆవేశంగా ఊగిపోతూ వేదిక మీద నుంచి అరిచి అరిచి చెప్పారు. ఈ రోజు నుంచి “పింక్” సినిమా చిత్రీకరణలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు, రేపో మాపో కథా చర్చల్లో ఉన్న మరో సినిమా కూడా ప్రారంభం కావచ్చు.

“ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు, దాడులు చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది, అన్నం మానేసేవాడిని, నిద్ర పోని రాత్రులెన్నో.. వీటన్నిటికీ సమాధానం కఠిన శిక్షలో, ఎన్కౌంటర్లో కాదు – మనిషిలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. అందుకే మొదటి నుంచీ నేను నా ప్రతి సినిమాలో ఒక పాట ద్వారా ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సందేశాత్మక చిత్రం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందనిపించి నేను ఈ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను” అంటూ ఆయన ఉద్వేగభరితంగా ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లో మాట్లాడేస్తే ఆయన అభిమానులు ఎప్పటిలాగే ‘పవర్ స్టార్’ నినాదాలతో ఈలలు వేసుకుని, గోలలు చేసుకుని ఇళ్లకెళ్లిపోతారేమో కానీ సాధారణ మనుషుల్ని మాత్రం తొలచి వేసే ప్రశ్న ఇది –

పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తున్నాడంటే వైఎస్ జగన్ పాలన అద్భుతంగా ఉందని ఒప్పుకున్నట్టేనా ?