తెలుగు నిర్మాతలకు OTT టెన్షన్

ఇరవై రోజుల పాటు కొనసాగనున్న లాక్ డౌన్ పుణ్యమాని జనం టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాపులకు అతుక్కుపోతున్నారు. ఇవేవి లేని పాత జమానా రోజుల్లో కనక ఇలాంటి కరోనా వైరస్ వచ్చి ఉంటే జనం బోర్ కొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టేసుకునేవాళ్ళేమో. అలా అని కేవలం ఛానల్స్ చూస్తే టైం పాస్ అయ్యే రోజులు కావివి. అంతా డిజిటల్ మాయమైపోయింది. ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ కు విపరీతమైన ట్రాఫిక్ వచ్చి పడుతోంది. ఈ తాకిడి తట్టుకోలేక అమెజాన్ లాంటి పేరున్న సైట్స్ సైతం తమ రెజొల్యుషన్ ని స్టాండర్డ్ కు పరిమితం చేయాల్సి వచ్చింది.

ఇదిలా ఉండగా ఈ ఖాళీ సమయంలో కావాల్సినన్ని తెలుగు సినిమాలు లేక పబ్లిక్ ఇతర బాషల మూవీస్ కూడా చూస్తున్నారు. ఎలాగూ సబ్ టైటిల్స్ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడంలో ఇబ్బందేమీ ఉండదు. కొన్ని సినిమాలకు తెలుగు ఉపశీర్షికలు కూడా ఇవ్వడం బాగా కలిసి వస్తోంది. కాని ఇలా బాషా భేదం లేకుండా ఎంటర్ టైన్మెంట్ ను జనం ఎంజాయ్ చేయడం ఇప్పుడు నిర్మాణంలో ఉన్న మన రీమేక్ నిర్మాతలకు టెన్షన్ కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అసలు వెర్షన్ ‘పింక్’ ని వెతుక్కుని మరీ చూస్తున్నారు. తమిళ రూపకం ‘నీర్కొండ పార్వై’ సైతం భారీ విజిట్స్ తెచ్చుకుంటోంది. వెంకటేష్ నారప్ప ఒరిజినల్ మూవీ ‘అసురన్’ టాప్ ట్రెండింగ్ లో ఉంది. నితిన్ ‘అందాధున్’ చేస్తున్నాడు కాబట్టి అది ఏ యాప్ లో ఉందో సెర్చ్ చేసి మరీ పట్టేసుకుంటున్నారు.

రామ్ రెడ్ కూడా కోలీవుడ్ హిట్ మూవీ ‘తడం’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దీనికీ తాకిడి భారీగానే ఉందట. ఇలా క్రేజీ స్టార్స్ నటిస్తున్న సినిమాల తాలూకు అసలు మూలాల్ని ఇలా అదే పనిగా చూడటం వల్ల వీటి కథల పట్ల మనవాళ్ళకు యాంగ్జైటీ ఎంతో కొంత ఖచ్చితంగా తగ్గుతుంది. ఇంకా అఫీషియల్ గా రీమేక్ ప్రకటనే రాని ‘అయ్యప్పనుం కోశియుం’కు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం దక్కి స్ట్రీమింగ్ అలవాటున్నవాళ్ళు ఆల్రెడీ చూసేశారు. మొత్తానికి ఈ లాక్ డౌన్ పీరియడ్ మన రీమేక్ సినిమాలను ఇలా ఓటిటి రూపంలో దెబ్బ తీస్తోందన్న మాట. దీనికి ఎవరేమి చేయలేరు. హక్కులు కొనే సమయంలో ఒరిజినల్ వెర్షన్ ని ఆన్ లైన్ లో పెట్టకూడదన్న నిబంధన ఏది లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది వస్తోంది. ఫ్యూచర్ లో దీని మీద మనవాళ్ళు దృష్టి సారిస్తే బెటరేమో.

Show comments