iDreamPost
iDreamPost
ఏపీ శాసనమండలి సెలక్ట్ కమిటీ వ్యవహారం ముదురుతోంది. ప్రధాన పార్టీల మధ్య ప్రతిష్టాత్మకంగా మారుతోంది. ఇప్పటికే మండలి రద్దు ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వైఎస్సార్సీపీ నేతలు సెలక్ట్ కమిటీకి సహకరించకూడదనే సంకల్పంతో ఉన్నారు. తాము గుర్తించడం లేదని ఇప్పటికే ప్రకటించారు. కానీ టీడీపీ మాత్రం చైర్మన్ సహాయంతో ముందుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంది. దానికి తగ్గట్టుగా చైర్మన్ షరీఫ్ ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన కూడా చేశారు. బీజేపీ, పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీల జాబితాతో కమిటీ ప్రకటించారు.
కానీ చైర్మన్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీ ఫైల్‌ని శాసనమండలి కార్యాలయం వెనక్కి పంపడం చర్చనీయాంశం అయ్యింది. ఫైల్ మళ్లీ శానసమండలి చైర్మన్ కి చేరడం ఆసక్తిని రాజేస్తోంది. రూల్ 154 కింద కమిటీ వేయడం చెల్లదని ఫైలు మీద మండలి కార్యదర్శి బాలకృష్ణాచార్యులు పేర్కొనడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. రూల్ 154 కింద చైర్మన్ ప్రకటన ఉంటుందని, ఆ ప్రకటనకు అనుగుణంగానే కమిటీ వేయాల్సి ఉంటుందని విపక్షాలు వాదిస్తున్నాయి. చైర్మన్ నుంచి ఫైలు వచ్చిన వెంటనే కమిటీ వేయని పక్షంలో ఈ సారి మండలి ధిక్కరణ నోటీసు ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.
కానీ ప్రభుత్వం మాత్రం ఖాతరు చేయడం లేదు. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఈ సెలక్ట్ కమిటీని గుర్తించడం లేదని ప్రకటించింది. దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. త్వరలో బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్న వేళ సెలక్ట్ కమిటీ వ్యవహారం పెనుదుమారం దిశగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు నేరుగా మండలి కార్యదర్శిని కలిశారు.
సెలక్ట్ కమిటీని తక్షణం వేయాలని, దానికి సంబంధించి ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని కార్యదర్శిని కోరారు. కానీ ఆయన ససేమీరా అనడంతో టీడీపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.