నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు రోజుకో మలుపు తిరుగుతుంది. ఏదొక పిటిషన్ వేస్తూ శిక్ష అమలుకు జాప్యం కలిగేలా చేస్తున్న నిర్భయ దోషులకు వ్యతిరేకంగా కేంద్రం వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు, నిందితులందర్నీ ఒకేసారి ఉరి తీయాలని స్పష్టం చేసింది. మెర్సీ పిటిషన్ పెండింగ్ లో ఉంటే మిగిలిన నిందితులకు ఉరిశిక్ష విధించొచ్చని జైలు నిబంధనల్లో లేదని తేల్చి చెప్పింది. జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిందితుల రివ్యూ పిటిషన్లకు జాప్యం కలిగిందని తీహార్ జైలు అధికారులను చీవాట్లు పెట్టింది.. దోషులు నిదాన వైఖరి పాటిస్తుంటే తీహార్ జైలు అధికారులు నిద్ర పోతున్నారా? అని ఘాటుగా ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దోషులకు వారంలోపు న్యాయపరమైన అంశాలన్నీ పూర్తి చేసుకోవాలని హైకోర్టు సూచించింది..
కాగా గతంలో నిర్భయ నిందితుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ రాష్ట్రపతి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నారు.. అది పెండింగ్ లో ఉన్న కారణంగా నిర్భయ నిందితులకు ఉరిశిక్ష విధించలేమని ఉరి శిక్షపై స్టే విధించింది ట్రయల్ కోర్టు. దీన్ని సవాలు చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.. కాగా కేంద్రం వేసిన పిటిషన్ ని కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు వారం రోజుల్లో దోషులకున్న న్యాయపరమైన హక్కులను వినియోగించుకోమని దోషులకు వెల్లడించింది.