iDreamPost
android-app
ios-app

ఒలింపిక్స్​లో భారత్​కు 2 మెడల్స్​ అందించాడు.. కట్ చేస్తే సొంతింటిని కాపాడుకోలేక..!

  • Published Aug 02, 2024 | 6:32 PM Updated Updated Aug 02, 2024 | 6:32 PM

Samaresh Jung: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్​లో ఒక్క మెడల్ గెలిస్తేనే గొప్ప అనుకుంటే ఆయన తన అద్భుతమైన కోచింగ్​తో దేశానికి రెండు పతకాలు అందించాడు. కానీ ఇప్పుడు సొంతింటి కోసం ఫైట్ చేస్తున్నాడు.

Samaresh Jung: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్​లో ఒక్క మెడల్ గెలిస్తేనే గొప్ప అనుకుంటే ఆయన తన అద్భుతమైన కోచింగ్​తో దేశానికి రెండు పతకాలు అందించాడు. కానీ ఇప్పుడు సొంతింటి కోసం ఫైట్ చేస్తున్నాడు.

  • Published Aug 02, 2024 | 6:32 PMUpdated Aug 02, 2024 | 6:32 PM
ఒలింపిక్స్​లో భారత్​కు 2 మెడల్స్​ అందించాడు.. కట్ చేస్తే సొంతింటిని కాపాడుకోలేక..!

ప్రతిష్టాత్మక ఒలింపిక్స్​ క్రీడల్లో భారత్ మూడు పతకాలతో మెరిసింది. ఇంకా దేశానికి కొన్ని మెడల్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చిన మూడు పతకాల్లో రెండు మనూ బాకర్ సాధించినవే. ఒకటి వ్యక్తిగతంగా సాధిస్తే.. ఇంకో మెడల్ షూటర్ సరబ్​జిత్ సింగ్​తో కలసి కొల్లగొట్టింది మను. మరో మెడల్​ను షూటర్ స్వప్నిల్ గెలుచుకున్నాడు. దీంతో ఇప్పటివరకు మన దేశానికి వచ్చిన మెడల్స్ అన్నీ షూటింగ్​లో సాధించనవే అయ్యాయి. టఫ్ కాంపిటీషన్ ఉండే షూటింగ్​లో మెడల్స్ సాధించడం అంత ఈజీ కాదు. కానీ ఇండియా ఏకంగా మూడు పతకాలు కైవసం చేసుకోవడంతో అందరూ మన షూటర్ల గురించే మాట్లాడుకుంటున్నారు. భలే ఆడారంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

దేశానికి మూడు ఒలింపిక్ మెడల్స్ రావడంలో షూటర్ల పాత్ర ఎంత ఉందో.. వెనుక ఉండి వాళ్లను గైడ్ చేసిన కోచ్ సమరేష్ జంగ్ రోల్ కూడా అంతే ఉంది. మనూ భాకర్, సరబ్​జిత్​ను ఆయనే తీర్చిదిద్దారు. ఒకప్పుడు షూటింగ్​లో దేశానికి ఆడుతూ సమరేష్ ఎన్నో పతకాలు గెలిచారు. అలాంటి లెజెండ్​ ఇప్పుడు సొంతింటిని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఆయన ఉంటున్న ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ హైకోర్టు నుంచి ఆయనకు నోటీసులు అందాయి. అక్రమ నిర్మాణమని, 48 గంటల్లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అందులో పేర్కొన్నారు. ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి వస్తే పూలమాలలతో ఘనంగా స్వాగతం పలుకుతారనుకుంటే నోటీసులు అందడంతో సమరేష్ జంగ్ షాకయ్యారు.

ఈ వివాదంపై సమరేష్ జంగ్ రియాక్ట్ అయ్యారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఇంటిని ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే రెండ్రోజుల్లోగా వెళ్లిపొమ్మంటే ఎలాగని.. ఢిల్లీలో ఉండేందుకు తనకు మరో ఇల్లు కూడా లేదని ఆయన వాపోయారు. తమకు కొంత సమయం ఇవ్వాలని.. ఇలా పీక మీద కత్తి పెట్టి ఖాళీ చేయాల్సిందేనని ఆర్డర్స్ వేయడం కరెక్ట్ కాదన్నారు. ఇక, సమరేష్ జంగ్ ఉంటున్న సివిల్ లైన్స్ కాలనీలో మరో 200 కుటుంబాలు కూడా ఉంటున్నాయి. ఈ కాలనీలో ఇళ్లు అక్రమ నిర్మాణాలని, ఈ స్థలం తమ పరిధిలోకి వస్తుందని రక్షణ శాఖ చెప్పడంతో అక్కడి ప్రజలు అయోమయంలో పడ్డారు. ఒలింపిక్స్​ నుంచి హుటాహుటిన చేరుకున్న జంగ్ కూడా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక ఇంట్లోని సామాన్లు సర్దుతున్నారు.