iDreamPost
iDreamPost
స్టార్ హీరోలకు మాస్ లో ఒక పట్టు దొరకాలంటే కెరీర్ లో మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఎంటర్ టైనర్స్ చాలా అవసరం. ఇవి క్లాసు మాస్ తేడా లేకుండా అందరినీ దగ్గర చేస్తాయి.చిరంజీవికి మొదటి బ్రేక్ ‘ఖైదీ’ దాదాపుగా పల్లెటూరిలో సాగే కథే. బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ తీసుకొచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’లో అసలు నగరం ఊసే ఉండదు. వెంకటేష్ ‘చంటి’ గురించి చెప్పేదేముంది. నాగార్జున సైతం మొదట్లో ‘జానకి రాముడు’ లాంటివి చేసినప్పటికీ ఈ నేపథ్యంలో మొదటి హిట్ అందుకుంది మాత్రం ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’తోనే. మీనా హీరోయిన్ గా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామాకు సంగీతం ఎంఎం కీరవాణి.
Also Read: ఛాలెంజింగ్ పాత్రల మేలు కలయిక రమ్యకృష్ణ – Nostalgia
పంపిణీదారుడిగా అశేష అనుభవం సంపాదించిన వి దొరస్వామిరాజు నిర్మాతగా మారి తీసిన మొదటి సినిమా నాగార్జునేతోనే.1987లో ‘కిరాయిదాదా’ కమర్షియల్ గా పే చేసింది కానీ ఆశించినంత స్థాయిలో వెళ్ళలేదు. 1990లో ఏఎన్ఆర్ ని మొదటిసారి విగ్గు లేకుండా తాతయ్య పాత్రలో చూపించి నిర్మించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ రాజుగారికి బంగారు బాతే అయ్యింది. వసూళ్లతో అవార్డులు రివార్డులు ఎన్నో మోసుకొచ్చింది. దాని తర్వాత జంట ద్వయం రమణి-మధులు సంయుక్తంగా తయారు చేసిన ఓ కథ నాగార్జునకు బాగా నచ్చింది. అప్పటికే తోటపల్లి మధు పనితనాన్ని చూసిన నాగ్ ఆలోచించకుండా స్క్రిప్ట్ బాధ్యతలు ఆయనకే అప్పగించారు. అలా ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. అక్కినేని ఫ్యామిలీతోనే రాజుగారికి మరో సినిమా వచ్చింది
ఊరిని గుప్పిట్లో పెట్టుకుని అక్రమాలు చేస్తున్న దేవుడు(సత్యనారాయణ)కి ఎదురెళ్లి ప్రెసిడెంట్ గా గెలుస్తాడు రాజా(నాగార్జున). స్వంత అన్నయ్య(చంద్రమోహన్)దేవుడి దగ్గర పనిచేస్తుండటంతో రాజా కుటుంబం రెండుగా విడిపోతుంది. ముందు అపార్థం చేసుకున్నా ఆ తర్వాత రాజా మనసు తెలుసుకున్న దేవుడు కూతురు స్వప్న(మీనా)వీళ్ళ ఇంటికే వచ్చేస్తుంది. ఆ తర్వాత జరిగేదే అసలు కథ. పూర్తిగా గ్రామీణ నేపధ్యంలో సాగే డ్రామాను తెరకెక్కించిన తీరు ప్రెసిడెంట్ గారి పెళ్ళాంకు ఘనవిజయం చేకూర్చింది. 1992 అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమా శతదినోత్సవం కూడా జరుపుకుంది. కీరవాణి పాటలు మ్యూజికల్ గానూ హిట్ అందుకున్నాయి
Also Read: రాక్షసుడు – 35 ఏళ్ళ క్రితమే వచ్చిన మెగా రాఖీభాయ్ – Nostalgia