రాక్షసుడు - 35 ఏళ్ళ క్రితమే వచ్చిన మెగా రాఖీభాయ్ - Nostalgia

By iDream Post Sep. 14, 2021, 08:30 pm IST
రాక్షసుడు  - 35 ఏళ్ళ క్రితమే వచ్చిన మెగా రాఖీభాయ్ - Nostalgia

అదేంటి కెజిఎఫ్ కి చిరంజీవి రాక్షసుడు సినిమాకు లింక్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. వివరాల్లోకి వెళ్తే మీకే తెలిసిపోతుంది. ఊహించని స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న కెజిఎఫ్ కు మెగా మూవీకి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1986లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన రాక్షసుడు నవలను అదే పేరుతో నిర్మాత కేఎస్ రామారావు గారు ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇది చిరంజీవికి మొదటి సినిమా స్కోప్ చిత్రం. సుహాసిని, రాధా హీరోయిన్లు కాగా ఇళయరాజా సంగీతం, ఎంవిఎస్ హరనాథరావు సంభాషణలు సమకూర్చారు. నాగబాబుకి డెబ్యూ మూవీ.

ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఒక దీవి లాంటి అడవిలో వందలాది బానిసలతో వంకచక్కర రామ్మూర్తి(కన్నడ ప్రభాకర్) రహస్య వ్యాపారం చేస్తూ ఉంటాడు. చిన్నప్పుడే ఒకడు చేసిన మోసం వల్ల అక్కడికి వచ్చి పెరిగి పెద్దవుతాడో యువకుడు(చిరంజీవి). ఓ మంచి సమయం చూసి స్నేహితుడు సింహం(నాగబాబు)తో కలిసి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. తల్లి కోసం అన్వేషణ మొదలుపెట్టినా ఆవిడ దొరకదు. ఆ సమయంలో రామ్మూర్తి సామ్రాజ్యాన్ని అంతం చేస్తే తల్లిని చూపిస్తానని ఒప్పందం చేసుకుంటాడు మంచివాడైన పెద్దమనిషి జేకే(రావుగోపాల్ రావు). అమ్మ కోసం ఆ కుర్రాడు చేసే మహాయజ్ఞమే రాక్షసుడు సినిమా.

బానిసల గుంపు, దానికో దుర్మార్గ నాయకుడు, హీరోకు తెగింపు లక్షణాలు ఉండటం, తల్లి కోసం తల్లడిల్లడం, ఇవన్నీ రాక్షసుడు - కెజిఎఫ్ కు ఉన్న కొన్ని పోలికలు. కెజిఎఫ్ లాగే సెకండ్ హాఫ్ లో ఎక్కువ భాగం దీవిలోనే జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు అసలు పేరే ఉండదు చివరి దాకా. ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తుంటారు. విలన్ చేతిలో చనిపోయే ఇన్స్ పెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ నటించారు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అచ్చా అచ్చా పాటలు అప్పట్లో ఉర్రూతలూగించాయి. రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా నిలిచింది. 1986 అక్టోబర్ 2న విడుదలైన రాక్షసుడు కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకుంది కానీ కెజిఎఫ్ ఏకంగా చరిత్ర సృష్టించింది

Also Read : మంచి యాక్షన్ థ్రిల్లర్ కు నిర్వచనం - Nostalgia

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp