iDreamPost
iDreamPost
ఈ నెల 18 నుంచి లాక్ డౌన్ 4.0 ప్రకటించిన కేంద్రం చాలా సడలింపులు ఇచ్చింది. విద్యా సంస్థలు, దేవాలయాలు, సినిమా హాళ్లు, హోటల్స్ వంటివి తప్ప అన్ని వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చునని వెల్లడించింది. అయితే.. ట్రాఫిక్ పరంగా తప్పితే.. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ తొలి రోజు పెద్దగా మార్పులు కనిపించ లేదు. ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి వరకూ ఉన్నట్లుగానే కొన్ని చోట్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మరి కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఐదు వరకూ దుకాణాలు తెరిచి ఉంచారు.
రెండు రాష్ట్రాల్లోనూ ఎలక్రానిక్స్, ఆటో మొబైల్ దుకాణాలు తెరిచి ఉన్నాయి. ఇవి మినహా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా దుకాణాలన్నీ మూసే ఉన్నాయి. బంజారాహిల్స్ లో బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ డిజిటల్ సంస్థలు తెరుచుకున్నాయి. ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు జరిగాయి. మొబైల్ షోరూమ్ లు, కార్ల షోరూమ్ లు తెరవ లేదు కానీ.. రేపటి నుంచి తెరిచేందుకు సిద్ధమవుతున్నట్లుగా.. షోరూమ్ లలో శుభ్రత పనులు చేపట్టడం కనిపించింది. సడలింపులు ఇచ్చిన కేంద్రం పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయం కోసం వ్యాపారులు వేచి చూస్తున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేంద్రం మార్గ దర్శకాల ప్రకారం నడుచుకుంటామని చెప్పగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రకటించనున్నారు. సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ మాత్రం బాగానే కనిపించింది. సిగ్నల్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి. చెక్ పోస్టుల వద్దే కాకుండా సిగ్నల్స్ వద్ద పోలీసులు యధావిధిగా విధులు నిర్వహించారు. సాయంత్రం 7 తర్వాత యధావిధిగా కర్ఫ్యూ కొనసాగింది.