స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌తో పాటు, నోటిఫికేషన్‌ను కూడా రేపు విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్‌ ప్రకటించారు.ఈవీఎం పనితీరుపై పూర్తిస్థాయి నమ్మకం ఉన్నప్పటికీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్‌ పద్దతిలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.లోకల్ బాడీ ఎన్నికలతో పాటు జరపనున్న మున్సిపల్‌ ఎలక్షన్స్ కూడా బ్యాలెట్‌ పద్దతిలోనే జరుగుతాయని ప్రకటించారు. ఇప్పటికే ఎన్నికల సంసిద్ధతకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు.

ప్రశాంతంగా,స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు సహకరించాలని కోరుతూ రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హేతుబద్దంగా తయారుచేసిన ఎన్నికల షెడ్యూల్ పై రాజకీయ పక్షాలు ఎటువంటి సందేహాలు,అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. సింగిల్ డెస్క్ విధానం ప్రకారం ఎన్నికల ప్రచారానికి,సభలకు రాజకీయ పార్టీలకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని,పాత పత్రాలు ఉన్నా అనుమతిస్తామని ఎన్నికల కమిషనర్ తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా స్థానిక ఎన్నికల సంస్కరణలపై తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ప్రకారము ఎన్నికలలో ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అభ్యర్థులపై అనర్హత వేటు కూడా వేస్తామని హెచ్చరించారు.ప్రస్తుతం ​అందుబాటులో ఉన్న ఉద్యోగులు ఎన్నికల విధులకు సరిపోతారని,అవసరమైతే గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా వినియోగిస్తామని తెలిపారు.

కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికలపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంటుందని ఈసీ దృష్టికి తీసుకువచ్చారని,అయితే ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేశారు.కాగా ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు ఎన్నికల ప్రక్రియ అనంతరం ఏప్రిల్‌లో నిర్వహించడానికి ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రకటించారు.

Show comments