గ్యాస్‌ లీకేజీ బాధితులకు మరో వరం

విశాఖ ఎల్పీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు జగన్‌ సర్కార్‌ మరింత చేయూత ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం పంపిణీ చేయగా.. తాజాగా ఆయా కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఈ రోజు ఈ ఘటన, బాధితుల పరిహారంపై వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

బాధిత కుటుంబాల్లో ఒకరికి గ్రామా సచివాలయాల్లో ఉద్యోగం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈఘటనపై కమిటీని వేశామని, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో మూడు కమిటీలు వచ్చి పరిశీలన జరిపాయని సీఎం గుర్తు చేశారు. కమిటీల నివేదికలు వచ్చిన తర్వాత, కంపెనీ నుంచి కూడా నివేదికలు తీసుకుని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా భవిష్యత్‌లో కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కాగా, గ్యాస్‌ లీకేజీ ఘటనలో బాధితులందరికీ పరిహారం పంపిణీ కార్యక్రమం పూర్తయింది. జరిగిన నష్టం ప్రకారం కోటి రూపాయల నుంచి 10 వేల రూపాయల వరకు పరిహారం ప్రభుత్వం ఇచ్చింది. ఈ మొత్తాలను అధికారులు ఆయా గ్రామాల్లోని వారికి అందించారు. ఘటన జరిగిన వెంటనే సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదిక చేసిన అధికార యంత్రాంగాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రశంసించారు.

Show comments