iDreamPost
android-app
ios-app

అప్పట్లో వాలంటీర్లు దండగ అనుకున్న.. కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను అంటున్న బీజేపీ నేత

అప్పట్లో వాలంటీర్లు దండగ అనుకున్న.. కానీ ఇప్పుడు నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను అంటున్న బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు తమ ఊరిలోనే ప్రభుత్వ సేవలను అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే జగన్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయం, పట్టణాల్లో ప్రతి నాలుగు వేల మందికి ఒక సచివాలయం చొప్పున ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ అంతకు రెండు నెలల ముందే వాలంటరీ ల ను నియమించింది. గ్రామాల్లో 50 కుటుంబాలకు ఒకరు, పట్టణాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒకరు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.80 లక్షల మందిని నియమించింది.

ఈ సమయంలో వాలంటరీ వ్యవస్థపై టిడిపి తో పాటు బిజెపి, జనసేన అన్ని పార్టీల నాయకులు విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీల పని తీరే ఇందుకు కారణం. పట్టణ, స్థానిక సంస్థల పాలక మండళ్లను నిర్వీర్యం చేసేలా జన్మభూమి కమిటీలు పని చేశాయి. ప్రజలచేత ఎన్నుకోబడే ప్రజా ప్రతినిధులను తో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలకు, ఇతర కార్యక్రమాలను జన్మభూమి కమిటీలు నిర్ణయించడం,స్థానిక సంస్థలకు సమాంతరంగా రాజ్యాంగేతర శక్తిగా జన్మభూమి కమిటీలు వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చూశారు. అందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ కూడా మరో జన్మభూమి కమిటీలు గా తయారు అవుతుంది అన్న ఆందోళనతో రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి.

అయితే గ్రామ, వార్డు వాలంటరీ ల సేవలు ఏ స్థాయిలో ఉంటాయో తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ చూస్తున్నారు. గతంలో వాలంటరీ వ్యవస్థ పై విమర్శలు చేసిన రాజకీయ నేతలు తమ అభిప్రాయాలను తప్పని తాజాగా తెలుసుకుంటున్నారు. అలా తెలుసుకోవడమే కాదు తమ తప్పును బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. తాజాగా ఓ టీవీ చర్చా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థపై ప్రారంభంలో ఇప్పుడు తన అభిప్రాయాలను చెప్పారు. ” వాలంటీర్ల ను మొదట నేను కూడా విమర్శించాను. కానీ ఇప్పుడు వాళ్ళ పని తీరు చూశాక నా అభిప్రాయం తప్పని తెలుసుకున్నాను. వాలంటీర్లు బాగా పని చేస్తున్నారు.” అని లక్ష్మీపతి రాజా తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

జన్మభూమి కమిటీలు మాదిరిగా వాలంటరీ లు కూడా పనిచేస్తారు. వైసీపీ మద్దతు దారులకే ప్రభుత్వ పథకాలు అందిస్తారు. స్థానిక సంస్థలకు సమాంతరంగా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తారు.. అనుకున్న రాజకీయ పార్టీల నేతలకు తాజాగా తమ అభిప్రాయాలు తప్పని స్పష్టమవుతోంది. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించడంలోనూ, ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేయడంలోనూ వాలంటీర్ సేవలు అత్యుత్తమం. ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రారంభమైనప్పటినుంచి అనుమానిత లక్షణాలున్న బాధితులను, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సార్లు ఇంటింటి సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించారు. ఈ సమాచారం మేరకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారణ పరీక్షలు చేస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని కరోనా సంబంధిత డేటా.. ఆంధ్రప్రదేశ్ కి ఉందంటే అది వాలంటీర్ల సర్వే వల్లనే అని ఘంటాపథంగా చెప్పవచ్చు.