iDreamPost
iDreamPost
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కుప్పం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ కే.చంద్రమౌళి గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ నేడు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2019 ఎన్నికల సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రమౌళి ఎన్నికల అనంతరం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆరోగ్యం కుదుటపడక పోవడంతో కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి తిరుపతిలో యం.ఏ చదువుతున్న రోజుల్లో పక్క క్యాంపస్లో వై.యస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు వివేకానంద రెడ్డి గారు బి.యస్.సి అగ్రికల్చరల్ చదవడంతో ఆయనకి వై.యస్ ఫ్యామిలీతో పరిచయాలు అనాటి నుండే ఏర్పడ్డాయి. ఆ తరువాత కడప కి కలక్టర్ గా భాద్యతలు నిర్వర్తించడం తో ఆయన వై.యస్ కుటుంబానికి ముఖ్యంగా వై.యస్ పాలనకు ఆకర్షితులయారు. వై.యస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్ పై కాంగ్రెస్ పార్టీ వేదింపులకి దిగడంతో సహించలేక ఉద్యోగం వదిలి వై.యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబుకి కంచుకోటగా చెప్పబడే కుప్పం నుండి వై.సి.పి అభ్యర్ధిగా బరిలోకి దిగిన చంద్రమౌళి మొదటిసారి ఎన్నికల్లోనే 55,839 ఓట్లు సాదించి మొట్టమొదటి సారో కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగా నిలబడి అన్ని ఓట్లు సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇక 2019 ఎన్నికల్లో ఆరోగ్యం సహకరించకపోయినా ప్రచారంలో దూసుకుని వెళ్ళారు ఏకంగా చంద్రబాబుని ఆయన కంచుకోటగా చెప్పబడే కుప్పంలోనే ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్లు లో వెనక్కు నెట్టి మొత్తంగా 69,424 సాదించి చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించారు. ఈ ఎన్నికల్లోనే కుప్పం నుంచి చంద్రబాబుకు ఇదే కనిష్ట మెజారిటీ(30 వేలు) కావటం గమనార్హం.
ఆయన మరణం వై.యస్.ఆర్ కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యంగా కుప్పం లో ఆయన అభిమానులకు తీరని లోటు.