iDreamPost
android-app
ios-app

జేడీ లక్ష్మీ నారాయణ ఎక్కడ మొదలు పెట్టారో.. అక్కడికే వచ్చారు..

జేడీ లక్ష్మీ నారాయణ ఎక్కడ మొదలు పెట్టారో.. అక్కడికే వచ్చారు..

జనసే పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) వి.వి. లక్ష్మీనారాయణ మళ్లీ తన ప్రయాణాన్ని పూర్వాశ్రామం నుంచే ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన తన రాజకీయ ప్రయాణం గురించి మీడియాకు వెల్లడించారు. ఇకపై తన ప్రయాణం రైతులతో కొనసాగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

జేడీ తాజా నిర్ణయంతో ఉద్యోగ విరమణ తర్వాత ఎక్కడ నుంచి తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాలరో తిరిగి అక్కడకే వచ్చినట్లైంది. సీబీఐ అధికారిగా ముందస్తు ఉద్యోగ విరమణ చేసిన లక్ష్మి నారాయణ రైతు సమస్యలు తెలుసుకునేందుకంటూ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. 2019 ఎన్నికలకు ముందు పార్టీ పెడతానని స్వయంగా లక్ష్మి నారాయణ ప్రకటించినా తర్వాత ఆ విషయం కనుమరుగైంది. టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా.. చివరకు జనసేనలో చేరారు. గడచిన సాధారణ ఎన్నికల్లో విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలకడలేమి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Read Also: జేడీ పయనమెటు..?

ఊహించినట్లుగానే..

ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన జేడీ లక్ష్మినారాయణ పయణం ఎలా సాగబోతోందన్న అంశంపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. జేడీ ముందు నాలుగు ఆప్షన్‌లు (1. ఢిల్లీలో ఆప్‌కు పని చేసి ఆ తర్వాత ఏపీ ఆప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టం. 2. బీజేపీలో చేరడం. 3. టీడీపీలో చేరడం. 4. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలు తెలుసుకోవడం.. ఆ తర్వాత బీజేపీలో చేరడం.) ఉన్నాయని పరిశీలకులు పేర్కొన్నారు. ఇందులో 4వ ఆప్షన్‌కే జేడీ మొగ్గు చూపుతారని అంచనా వేశారు. తాజాగా జేడీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలు తెలుసుకుంటానని చెప్పడంతో పరిశీలకుల అంచనాలు నిజమయ్యాయి.