Idream media
Idream media
తమకు ఇష్టం లేని వాళ్లు ఎలాంటి మంచి పనులు చేసినా కొందరికి కనిపించవు. వినిపించవు. పైగా విపరీతమైన రాజకీయ కడుపు మంటతో బాధపడుతూ.. ఆ అసహనాన్ని ఇతరులపై నిందలు వేయడం ద్వారా తగ్గించుకోవడానికి చూస్తారు. అలాంటి కోవలోకే చెందుతారు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి.
టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వైఎస్ జగన్‌ను వాడు వీడు అంటూ చులకనతో మాట్లాడడంతోపాటు లేనిపోని అభాండాలు వేస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు ప్రభాకర్‌రెడ్డి అయితే ఏకంగా వైఎస్ జగన్ తల్లి విజయమ్మపై కూడా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విపరీత పోకడలకు విసిగి వేసారిన ప్రజలు వారిద్దరి కొడుకులను పోయిన ఎన్నికల్లో ఓడించారు. అయినా సరే పరివర్తన చెందకుండా జేసీ దివాకర్‌రెడ్డి ప్రతి సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వేలం వ్యవహారంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ పొగుడుతుంటే.. జేసీ మాత్రం చవకబారు ఆరోపణలు చేస్తూ చులకన అవుతున్నారు. టీటీడీ ఆస్తులను అమ్మాలని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై సీఎం జగన్ ఒత్తిడి చేశారంటూ ఓ పనికిమాలిన ఆరోపణ చేశారు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి ప్రతిపక్షంలో ఉండగా పెద్ద పోరాటమే చేశారు వైఎస్ జగన్. సదావర్తి భూములను తక్కువ ధరకు అమ్మడాన్ని అడ్డుకొని విలువైన భూములను కాపాడారు. అలాంటి వ్యక్తిపై నేడు జేసీ దివాకర్‌రెడ్డి కడుపు మంటతో విమర్శలు చేస్తుండడంపై ఆయన అనుచరుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
టీడీపీ అధికారంలో ఉండగానే తిరుమల ఆస్తులను అమ్మడానికి ప్రతిపాదలు సిద్దం చేశారనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో దీని గురించి మాత్రం జేసీ మాట్లాడలేదు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి టీటీడీ బోర్డు ప్రతిపాదనలపై మాత్రమే సమీక్ష జరిగింది. దీన్నిపట్టుకుని తిమ్మిని బమ్మిని చేయడానికి తెలుగుదేశం, దాని అనుబంధ విపక్షాలు పెద్ద రాద్ధాంతం చేశాయి. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆస్తులు ఎక్కడున్నా, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నా లేకున్నా ఆ ఆస్తుల అమ్మకాలపై శాశ్వత నిషేదం విధించింది. ఇది జరిగి కూడా వారం అవుతోంది. అయినపోయిన పెళ్లికి భాజా భజంత్రీలు అన్న చందాన ఇప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి బయటకు వచ్చి, వైఎస్ జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జేసీ కుటుంబానికి చెందిన త్రిశూల్ సిమెంట్ వ్యవహారంలో సున్నపురాయి దోపిడీని అడ్డుకున్నారు. అలాగే జేసీ బస్సుల రిజిస్ట్రేషన్లలో జరిగిన అక్రమాలను, నాగాలాండ్‌లో లారీల రిజిస్ట్రేషన్ కుంభకోణాలు బయటకు తీశారు. పైగా నియోజకవర్గంలో రోజురోజుకూ జేసీ కుటుంబ ప్రతిష్ట చెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించుకున్న జేసీ కుటుంబం, స్థానిక ఎన్నికల సందర్భంగా మళ్లీ పోటీ దిగేందుకు సిద్ధమయ్యారు. గతంలో చౌకబారు ఆరోపణలు చేసి ప్రజల్లో చులకన అయ్యి కొడుకుల రాజకీయ భవిష్యత్తును చెడగొట్టుకున్న జేసీ బ్రదర్స్ ఇప్పుడు కూడా తమ పంథా మార్చుకోకుండా వ్యవహరించడంపై అనుచరులే పెదవి విరుస్తున్నారు.