Idream media
Idream media
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే అతను. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రెండు చోట్లా పోటీ చేశారు. కానీ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తుఫానులో అక్కడ, ఇక్కడా కూడా పవన్ కల్యాణ్ ఓటమిని చవి చూశారు. పార్టీ అధినేత కూడా గెలవలేని పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వర ప్రసాద్ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్కడుగా టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యాడు. అయితే.. రాపాక ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూడా.. జనసేనలో ఉంటాడా.. ఉండరా.. అనే చర్చలు సాగుతూనే ఉన్నాయి. కొత్తలో ఈ విషయమై ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఇందులోనే ఉంటే నేను నంబర్ వన్ అవుతానని, పార్టీ మారేది లేదని తెలిపారు.
తదనంతర కాలంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఫిదా అయ్యారు. మూడు రాజధానుల విషయంలోనూ ఆ పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. దీంతో ఆయన వైసీపీలో చేరడం లాంఛనమే అని ఖాయమైంది. ఆ పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసినా తన నిర్ణయాన్ని నిర్భయంగా తెలిపారు. అప్పటి నుంచి జనసేన పార్టీకి దూరంగానే ఉంటున్నారు.
ఇప్పుడు తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే కి రాపాక వర ప్రసాద్ ఎవరికి ఓటు వేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ ఎన్నికల్లో నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, రిలయన్స్ సంస్థకు చెందిన పరిమళ్ సత్వానీ, రాంకీ సంస్థకు చెందిన అయోధ్య రామిరెడ్డి పోటీ చేశారు. వారు నెగ్గేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ పార్టీ చేసింది. ఆ పార్టీకి 151 స్థానాలు ఉండడంతో వారి గెలుపు ఖాయమనేది కూడా అందరికీ తెలిసిందే.
కానీ.. గెలిచే అవకాశం లేకపోయినా టీడీపీ నుంచి వర్ల రామయ్యను పోటీలో దింపారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. వెగలపూడిలోని అసెంబ్లీ హాల్ లో జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ శాసనసభ్యులు 151 మంది ఉండగా.. వారి ఓట్లతో పాటు ఆ పార్టీ అభ్యర్థులకు మరో ఓటు అధికంగా వచ్చింది. ఆ ఓటు వేసింది జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్. దీంతో ఆయన కూడా వైసీపీ కి జై కొడుతున్నట్లు మరో సారి సుస్ఫష్టమైంది. మొత్తం 152 ఓట్లతో వైసీపీ అభ్యర్థులే రాజ్యసభకు ఎన్నికయ్యారు.