iDreamPost
iDreamPost
ఏపీ రాజధాని వ్యవహారం త్వరలో కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. కేంద్రం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత విపక్షాల్లో కొంత సందిగ్ధం ఏర్పడింది. అదే సమయంలో కోర్ట్ నుంచి కూడా స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో అటు కర్నూలు, ఇటు విశాఖ వైపు వ్యవహారాలు వేగంగా మళ్లుతున్నాయి. ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్నూలు వెళ్లేందుకు సిబ్బందిని సన్నద్ధం చేసింది. జీఏడీ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలు వెళ్లేందుకు సుముఖంగా ఉన్న జాబితా సిద్ధం చేస్తోంది. విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం. తో పాటుగా కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ కూడా కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది.
అదే సమయంలో విశాఖలో వివిధ కార్యాలయాల ఏర్పాటుకి ఎంపిక పూర్తయినట్టు కనిపిస్తోంది. వచ్చే ఏప్రిల్ నాటికి మొత్తం పాలన తరలించే దిశలో ప్రయత్నాలు సాగుతున్నాయి. డీజీపీ కార్యాలయంగా విశాఖ సీపీ ఆఫీసుని ఖాయం చేసినట్టు సమాచారం. జలవనరుల శాఖ కోసం ఏయూలో భవనం ఎంపికయ్యింది. సీఐడీ కోసం మాధవధారలో భవనం ఖరారయ్యిందని ప్రచారంలో ఉంది. ఇతర శాఖలు కూడా వివిధ భవనాలను గుర్తించడం, వాటిలో పలు కార్యాలయాలకు ఖరారు చేయడం జరిగిందని చెబుతున్నారు. ఇక కీలకమయిన సెక్రటేరియేట్ కోసం రిషికొండలోని మిలీనియం టవర్స్ ని ఎంపిక చేశారు. అక్కడ ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న బి టవర్ నిర్మాణం కోసం తాజాగా 19.5 కోట్ల నిధులు విడుదల చేశారు. పనులు కూడా వేగవంతం చేశారు. ఐటీ కంపెనీలను బీ టవర్స్ లోకి మారుస్తారా లేక మొత్తం మిలీనియం టవర్స్ నుంచి ఇతర చోట్లకు తరలిస్తారా అన్నది క్లారిటీ లేదు.
ఐటీ కంపెనీలపై సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారానికి భిన్నంగా ప్రస్తుతం మిలీనియం టవర్స్ వ్యవహారాలున్నాయి. దాదాపు అన్ని కంపెనీలు యధావిధిగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అదే సమయంలో అక్కడి పలు ఐటీ సంస్థల భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని లీజు ప్రాతిపదికన ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. న్యూనెట్ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన 60వేల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఐటీ సంస్థల చేతుల్లో ఖాళీగా ఉన్న స్థలాలపై దృష్టి సారించినట్టు చెబుతున్నారు.
అదే సమయంలో విశాఖలో మెట్రో కి కూడా ప్రభుత్వం కొత్త డీపీఆర్ సిద్ధం చేస్తోంది. మెట్రో వర్క్స్ వీలయినంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో పలుమార్పులు కనిపిస్తున్నాయి. రాజధాని హంగామా మొదలయ్యింది. అధికారుల రాకపోకలతో సందడి కనిపిస్తోంది. ఇక ఉగాది తర్వాత మరింత మరిన్ని మార్పులు ఖాయంగా చెప్పవచ్చు. దాంతో విశాఖకి రాజదాని సొగసు సంపూర్ణంగా వస్తుందనే అభిప్రాయం బలపడుతోంది.