జగన్ ఆదేశాలతో విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం వెంటనే చెల్లింపు

  • Published - 03:51 AM, Mon - 11 May 20
జగన్ ఆదేశాలతో విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు పరిహారం వెంటనే చెల్లింపు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారంలో బాధితులకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వైజాగ్ గ్యాస్ లీక్ సంఘటనపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తక్షణమే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు నష్టపరిహారం సోమవారం నాటికి చెల్లించాలని, ఆదివారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గ్యాస్ లీక్ వల్ల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. విశాఖలో గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలో గ్యాస్ స్థాయిని న్యూట్రలైజ్ చేసి పరిసర ప్రాంతాలను సురక్షితంగా చేయడానికి తీసుకున్న చర్యలను వివరించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను కోరారు. కాగా ఈ స్టైరీన్ కంటెంట్ వాతావరణంలో సురక్షిత స్ధాయిలకు చేరిందని, పనులను నిపుణుల ద్వారా పర్యవేక్షిస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

సరైన పారిశుధ్యం, భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతనే గ్రామస్థులకు అనుమతి ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్యాస్ లీక్ వల్ల నష్టపోయిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఎల్జీ పాలిమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీక్ అవడం వల్ల 12 మంది మృతి చెందగా పలువురు ఆసుపత్రి పాలయ్యారు. కాగా మృతులకు కోటి రూపాయలు, వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్న బాధితులకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు,కంపెనీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉంటున్న 15000 మందికి పదివేల రూపాయల నష్టపరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Show comments