iDreamPost
iDreamPost
నిజం నిప్పులాంటింది. పాపం చంద్రబాబు, ఆయన సన్నిహితులకు అది సహించరానిది. మింగుడుపడనిది. నిత్యం అర్థ సత్యాలలో జీవిస్తూ, వాటినే శ్వాసిస్తూ, అసలు సత్యాలను జీర్ణించుకోలేని స్థితిలో పచ్చదండు ఉంది. అందుకే పచ్చినిజాలను కూడా మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తోంది. ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పడం ద్వారా కొందరినైనా ఒప్పించగలమనే గోబెల్స్ సూత్రాన్ని ఆచరిస్తోంది. తాజాగా కరోనా నేపథ్యంలో కూడా ఈ ధోరణి తగ్గడం లేదు. చివరకు కోవిడ్ 19 కి సంబంధించిన పరీక్షల చుట్టూ అలాంటి అసత్యమే అనేకమార్లు వల్లిస్తోంది. టీడీపీ నేతలు, వారి పత్రికలు అదే విషయాన్ని పెద్ద గొంతు చేసుకుని మరీ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంకెలు అబద్ధాలు చెప్పవు. అధికారిక లెక్కల్లో వాస్తవాన్ని దాచిపెట్టడం అంత సలువు కాదు. అయినా బాబుకి ఇవేమీ పట్టవు.
అందుకే ఏపీలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయంటూ పదే పదే చెబుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు చూస్తుంటే ఏపీ టాప్ 5లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నతంగానూ, సమీప రాష్ట్రాల కన్నా మెరుగ్గాను కనిపిస్తోంది. అయినా టీడీపీ క్యాంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా టెస్టుల్లో ఏపీ ది 4 వ స్థానం , చాలా రాష్ట్రాల కన్నా జగన్ సర్కారు చొరవ చూపుతోంది. ఈ నిజాన్ని జనాలు గుర్తించకుండా చేసేందుకు టీడీపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అసలు పరీక్షలే చేయడం లేదని కొన్నాళ్లు, ఇప్పుడు చాలా తక్కువ చేస్తున్నారని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది.
దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రాలు. ఇలా ఉన్నాయి
(ప్రతి పదిలక్షల మందికి)
రాజస్థాన్ : 549
కేరళ : 485
మహారాష్ట్ర : 446
ఆంధ్రప్రదేశ్ : 331
గుజరాత్ : 331
తమిళనాడు : 324
ఇండియా సగటు 198
దేశవ్యాప్తంగా (ప్రతి పదిలక్షల మందికి) 198 పరీక్షలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పదిలక్షల మందికి 331 మందికి పరీక్షలు చేయిస్తోంది. ఇంత కఠోర సత్యం కూడా కళ్లెదురుగా ఉన్నా బాబు బ్యాచ్ వెనక్కి తగ్గడం లేదంటే నిజాలను ఏమాత్రం జీర్ణం చేసుకునే స్థితిలో వారు లేరని ఇట్టే అర్థమవుతోంది. తొలుత రోజుకి 90 పరీక్షలు మాత్రమే చేయగలిగే దశ నుంచి ఇప్పుడు రోజూ 3వేల పరీక్షలు చేస్తున్నారు. త్వరలోనే వాటిని మరింత పెంచే పనిలో ప్రభుత్వం ఉంది. ర్యాండమ్ పరీక్షలకు కూడా శ్రీకారం చుట్టింది. అయినా ప్రజలకు నిజం చెప్పడం అసలు నచ్చని బాబు అండ్ కో, సామాన్యులు ఆ నిజాన్ని గ్రహించకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందని స్పష్టం అవుతోంది. పరీక్షల్లో ఫెయిల్ అంటూ రాస్తున్న కథనాలు, పదే పదే చంద్రబాబు ప్రకటనలు దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. అయినా వాస్తవం చెరిగిపోదు..అసలు నిజం మరుగునపడదు. ఈ విషయం అర్థంకాని టీడీపీ నేతలు అనవసర శ్రమ ఎంతగా చేసినా ప్రయోజనం ఉండదని గ్రహిస్తే మంచిది.