Idream media
Idream media
అంతరిక్ష పరిశోధన, రక్షణ రంగాల్లో భారత్‌కు ఎనలేని విజయాలు చేకూరుస్తున్న ఇస్రో, డీఆర్‌డీవోలు.. ఇప్పుడు కరోనాపై కూడా దేశాన్ని గెలిపించడానికి నడుం బిగించాయి. కొన్ని రోజుల పాటు రాకెట్ల పరిశోధనలను పక్కనపెట్టి కరోనాపై దేశం చేస్తున్న పోరాటానికి సహాయం అందించడానికి ఇస్రో సిద్ధపడింది. ప్రస్తుతం ఆస్పత్రులను వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. çకరెంటు లేకపోయినా సులభంగా ఆపరేట్ చేసేలా వెంటిటేటర్లను తయారు చేయడానికి సహకారం అందించనుంది. కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఇప్పటికే డిజైన్లను తయారుచేసినట్లు ఇస్రో డైరెక్టర్ సోమనాథ్ తెలిపారు. అయితే వెంటిలేటర్ల తయారీని పరిశ్రమలే తీసుకోవాలన్నారు. అలాగే ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి తోడ్పాడు అందిస్తామని వివరించారు. వెయ్యి లీటర్లకు పైగా శానిటైజర్ బాటిళ్లను ఇస్రో ఉద్యోగులు తయారు చేసినట్లు తెలిపారు.
మరోవైపు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) కూడా కరోనాపై పోరుకు తన వంతు సహాయం అందిస్తోంది. ఇప్పటికే క్రిటికల్ కేర్ వెంటిలేటర్లు, ఎన్ 99 అడ్వాన్స్‌డ్ మాస్క్‌లు, బాడీ సూట్‌ల తయారీని మొదలుపెట్టింది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానుంది. 30వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ల తయారీ పూర్తవనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఒకేసారి పలువురు రోగులకు ఉపయోగించేందుకు వీలుగా మల్టీ పేషెంట్ వెంటిలేటర్లను తయారు చేసినట్లు తెలిపారు. 5వేల వెంటిలేటర్లు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. కరోనాను అడ్డుకునేందుకు వీలుగా ఐదు లేయర్లు కలిగిన నాణ్యతతో కూడిన ఎన్ 99 మాస్క్‌లు కూడా తయారవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.