Idream media
Idream media
మీడియా ప్రాధాన్యత ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. కాలం, ఘటన ఆధారంగా దేనికి ఎంత ప్రాముఖ్యం వస్తుందో అంచనా వేయచ్చు. మొదటి పేజీ ఘటన అనుకున్నది మరి కాసేపటికి లోపలి పేజీకి వెళ్లోచ్చు. రెండు రోజులకు అది అస్సలు కనిపించకపోవచ్చు. అంటే.. నిన్న మొన్నటి వరకు జరిగిన సీఏఏ, సీఆర్‌సీ అంశాలు మాదిరిగా అన్న మాట.
ఇలాగే ఢిల్లీ ఎన్నికలు కూడా ఈ గాటినే కట్టేయచ్చు. గత ఎన్నికలప్పుడు తెలుగు ప్రధాన పత్రికల్లో ఢిల్లీ ఎన్నికల గురించి ప్రతి రోజూ వార్తలు, కథనాలు వచ్చాయి. నోటిఫికేషన్ వచ్చినప్పుటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విశ్లేషణాత్మక కథనాలు వండి వర్చాయి. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ చిన్న రాష్ట్రమైనా దేశ రాజధాని కావడంతో అంత ప్రాముఖ్యత ఇచ్చారు. పైగా ఏర్పడిన ఏడాదిన్నరకే ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభత్వం కూలిపోవడం, అప్పటికే లోక్ సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బీజేపీ విజయదుందుభి మోగించిన అనంతరం జరిగిన ఎన్నికలు కావడం దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి హేమాహేమీ నాయకులు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆప్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ప్రచారం నిర్వహించారు. తెలుగు పత్రికలు ఆ వార్తలను ప్రముఖంగా ప్రచురించాయి.
కట్ చేస్తే ఐదేళ్లు.. సీన్ రివర్స్ అయింది. నేటితో ఢిల్లీ శాసన సభ ఎన్నికలకు నామినేషన్ గడువు తీరిపోతోంది. ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మినహా ఆ తర్వాత ఢిల్లీ ఎన్నికలపై తెలుగు పత్రికల్లో ఆ వార్తలు వచ్చిన దాఖలాలు లేవు. విశ్లేషణలు లేవు. రెండు రోజుల్లో నామినేషన్ల పరిశీలన, వచ్చే నెల 8వ తేదీన పోలింగ్, ఆ తర్వాత మరో మూడు రోజులు.. అంటే 11వ తేదీన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండుఅంశాలు హాట్ టాపిక్‌గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వ్యవహారం, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలతో రెండు రాష్ట్రాల్లోని పార్టీలు, పత్రికలు బిజీబిజీగా ఉన్నాయి. అందుకేనేమో ఢిల్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీతోపాటు మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
గత ఎన్నికలల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకున్న ఆప్ ఈ సారి ఒంటిరిగా బరిలోకి దిగుతోంది. అదే విధంగా గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈ సారి ఎలాగైనా దేశ రాజధాని అసెంబ్లీలో కాషాయ జెండా ఎగురవేయాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఇక ఏడేళ్ల క్రితం 15 ఏళ్ల పాటు ఢిల్లీలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. తిరిగి ఆ ప్రభవం కాకపోయినా.. తన ఉనికి బలంగా చాటుకోవాలన్న పట్టుదలతో కలసి వచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయిన ఆర్‌జేడీతో పొత్తుతో బరిలో దిగింది. మరి ఈ సారి కూడా ఆప్ అధికారం నిలబెట్టుకుంటుందా..? లేక కాషాయ దళం పీఠాన్ని అధిరోహిస్తుందా..? లేదా కాంగ్రెస్‌కు పూర్వవైభవం వస్తుందా..? వచ్చే నెల 11వ తేదీన తేలనుంది.