దేశంలో లాక్‌డౌన్ విధించకముందే వృద్ధి రేటు అమాంతం పడిపోయింది. గత ఒక్కటి, రెండేండ్లుగా మాంద్యం పెరుగుతూ గడిచిన మార్చి నాటికి తీవ్ర స్థాయికి చేరిందనడానికి తాజా జిడిపి గణంకాలే నిదర్శనం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి 4.2 శాతానికి క్షీణించిందని స్వయంగా కేంద్ర గణాం కాల శాఖనే వెల్లడించింది. దీంతో దేశ వృద్ధి రేటు 11 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోయినట్టయ్యింది.
కేంద్ర గణంకాల శాఖ వివరాల ప్రకారం.. 2018-19లో దేశ జిడిపి వృద్ధి 6.1 శాతంగా ఉంది. కాగా 2019-20లోని జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో వద్ధి రేటు 3.1కు పడిపోయింది. 2019-20 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో వృద్ధి 5.2 శాతం, రెండో త్రైమాసికంలో 4.4 శాతం, మూడో త్రైమాసికంలో 4.1 శాతం చొప్పున నమోదయినట్టు గణంకాల శాఖ తెలిపింది.
2011-12 స్థిర ధరల వల్ల 2019-20లోని నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి రూ.38.04 లక్షల కోట్లుగా నమోదు కాగా.. 2018-19 ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.36.90 లక్షల కోట్లుగా ఉంది. కాగా క్రితం ఏప్రిల్‌తో ముగిసిన త్రైమాసికంలో జిడిపిపై కరోనా లాక్‌డౌన్ ఒత్తిడి చోటు చేసుకున్నట్టు గణంకాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
2019-20లో జిడిపి వద్ధి రేటు 5 శాతంగా ఉండొచ్చని తొలుత ఆర్‌బిఐ, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖలు అంచనా వేశాయి. దీనికి భిన్నంగా అమాంతం వృద్ధి రేటు పడిపోవడం ఆర్ధిక వ్యవస్థలోని బలహీనతలు బయటపడ్డాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి మోడీ సర్కార్ మార్చి చివరి వారంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో చివరి ఐదారు రోజులు మాత్రమే కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయినప్పటికీ వృద్ధి అమాంతం పడిపోవడం గమనార్హం.
2011-12 నాటి స్థిర ధరల వల్ల 2019-20లో తలసరి ఆదాయం 3.1 శాతం పెరిగి రూ.94,954గా నమోదయ్యింది. ఇంతక్రితం ఆర్దిక సంవత్సరంలో ఇది రూ.92,085గా ఉంది. ప్రస్తుత ధరలతో పోల్చితే 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం 6.1 శాతం పెరిగి రూ.1,34,224గా చోటు చేసుకుంది. 2018-19లో ఇది రూ.1,26,521గా ఉంది.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అది మరింత పడిపోయే అవకాశం ఉంది. లాక్ డౌన్ లేనప్పుడే వృద్ధి పతనం అయితే…లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలేవీ జరగటం లేదు. గత రెండు నెలలుగా మొత్తం స్తంభించడంతో దేశ ఆర్థిక వృద్ధి పతనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాక్ డౌన్ నుంచి ఇప్పుడిప్పుడు కొన్న సడలింపులు వచ్చినా పెద్దగా పూర్తి స్థాయి ఆర్థిక కార్యకలాపాలు మాత్రం జరగటం లేదు. అలాగే మరోవైపు కేంద్రం ప్రకటించి ఆర్థిక ప్యాకేజీ కూడా ఆర్థిక వృద్ధి పురోగమనానికి పెద్దగా ఉపయోగపడటం లేదు.