iDreamPost
android-app
ios-app

అత్యధిక కరోనా కేసులతో 4వ స్థానానికి చేరిన భారత్

అత్యధిక కరోనా కేసులతో 4వ స్థానానికి చేరిన భారత్

ఒక్కరోజులో 10,956 పాజిటివ్ కేసులు-396 మరణాలు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కానీ నిన్న తొలిసారిగా 400 కు చేరువలో మరణాలు సంభవించాయి.  కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 10,956 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 396 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకూ కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం. దాదాపు 11 వేల పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,97,535 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 8,498 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల్లో నిన్న నమోదయిన కేసులే అత్యధికం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ బ్రిటన్ ని వెనక్కి నెట్టి నాలుగవ స్థానానికి చేరుకుంది.  కరోనా వైరస్ బారినుండి 1,47,195 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,41,842 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,50,305 టెస్టులు నిర్వహించారు

మహారాష్ట్రలో 3607 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 3607 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 97648 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 3590 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 54,085 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1954 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 209 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 4320 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2162 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1993 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 165 మంది మృత్యువాత పడ్డారు.నిన్న ఒక్కరోజే 8 మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 182 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 5429 మందికి కరోనా సోకగా 80 మంది మృత్యువాత పడ్డారు. 2968 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2381 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 7,597,562 మందికి కోవిడ్ 19 సోకగా 423,846 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 3,842,204 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,089,701 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 116,034 మంది మరణించారు.