iDreamPost
android-app
ios-app

జగన్ నన్ను సలహా అడగవచ్చు కదా : చంద్రబాబు .

  • Published Apr 06, 2020 | 2:25 PM Updated Updated Apr 06, 2020 | 2:25 PM
జగన్ నన్ను సలహా అడగవచ్చు కదా : చంద్రబాబు .

ఎవరు ఎవర్ని సలహా అడగాలి , ఎవరు ఎవర్ని సంప్రదించాలి . మన రాష్ట్రంలో సలహా సంప్రదింపుల సంప్రదాయాలకు తిలోదకాలిచ్చింది ఎవరూ అనే ప్రశ్న ఉదయిస్తే అన్ని వేళ్ళు బాబు గారి వైపే చూపిస్తాయి అనటంలో సందేహం లేదు?

కేంద్రంలో కానీ , రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకొనేప్పుడు మిత్రపక్షాల్ని , విపక్షాల్ని సంప్రదించడం ఒక సాంప్రదాయంగా ఉండేది . 2004 -09 కాలంలో కూడా కొన్ని సందర్భాల్లో వైఎస్సార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్ష భేటీకి చంద్రబాబుని ఆహ్వానించడం జరిగేది . ఇరువురూ ఒకే వేదిక పంచుకోని ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భాలూ లేకపోలేదు . ఆ సత్సాంప్రదాయాన్ని గత ఐదేళ్లలో తుంగలో తొక్కింది చంద్రబాబునే.

అత్యంత కీలకమైన రాజధాని ప్రాంత ఎంపికకు విపక్షాలతో చర్చించిన సందర్భం ఒక్కటీ లేదు . పోనీ మిత్రపక్షమైన జనసేనతో అయినా చర్చించారా అంటే అదీ జరగలేదు . రాజధాని ఎంపికలో పలు పీలర్లు వదులుతూ చివరికి టీడీపీ ముందే ఎంచుకున్న ప్రాంతాన్ని ఏకపక్షంగా ప్రకటించినా జగన్ సమ్మతి తెలియజేశాడు . తర్వాతి కాలంలో టీడీపీ మిత్రపక్షమైన పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించి ఎవర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని , బలవంతపు భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతులకు అండగా ఉంటానని ప్రకటించడం , ఎవరి రాజధాని అమరావతి అని ఐవైఆర్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం గమనిస్తే ప్రతిపక్షంతో పాటు మిత్రపక్షాల్ని కూడా దూరంగా పెట్టిన తీరు అవగతమవుతుంది.

ఆ తరువాత రాజధాని శంఖుస్థాపనకి చంద్రబాబు ఎలా ప్రవర్తించారో టీడీపీ వారికి గుర్తు లేకపోయినా రాష్ట్ర ప్రజలకి గుర్తు ఉంది . పిలిచారో పిలవలేదో అనే గందరగోళం మధ్య చివరి గంటలో ఓ మంత్రిని పంపి ఆహ్వానం అందించాము అన్నారు అందించటానికి వెళ్ళాము లేడు అన్నారు . చివరికి పిలిచారో లేదో అనేది గందరగోళ అంశంగా మిగిలిపోయింది . ఇహ టీడీపీ మిత్రపక్షమైన జనసేనాని పవన్ కల్యాణ్ ని అసలు పిలిచారో లేదో తెలీదు కానీ ఆయన ఆ చాయల్లోకి కూడా రాలేదు . ఓటుకునోటు వంటి పలు వివాదాలుండి బాబుని అరెస్ట్ చేయటమే మిగిలివుంది అన్న పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలవటమే కాకుండా శిలాఫలకం పైన ఆయన పేరు కూడా అచ్చు వేసిన బాబు గారికి రాష్ట్రంలోని ప్రతిపక్ష నేత పేరు , ఇతర రాజకీయ పార్టీల నాయకుల పేర్లు గుర్తు రాకపోవడం బాధాకరం.

తరువాత ప్రత్యేక హోదా విషయంలో కానీ , హోదాని చంపేసి ప్యాకేజి తీసుకొనే సమయంలో కానీ , కేంద్రమే నిర్మించి అప్పజెప్పాల్సిన జాతీయ ప్రాజెక్టు బాధ్యతను కోరి మరీ తమ చేతుల్లోకి తీసుకొనే సమయంలో కానీ రాష్ట్రంలో ప్రతిపక్షం కానీ , ఇతర రాజకీయ పార్టీలు కానీ బాబు గారికి కనపడలేదు అన్నది వాస్తవం . వారిని సంప్రదిద్దాం ఉమ్మడిగా నిర్ణయించుకొని కేంద్రంతో మాట్లాడే సాంప్రదాయాన్ని పాటిద్దాం అని చంద్రబాబుకి ఆ రోజు అనిపించలేదు .

పోనీ వైసీపీని కాకపోయినా పలు రంగాల్లో అనుభవుఁజ్ఞులు మాజీ ముఖ్యమంత్రులు రోశయ్యని కానీ కిరణ్ కుమార్ రెడ్డిని కానీ , మీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రస్తుతం దూరంగా ఉన్న రైతు సమస్యల పట్ల అనుభవం ఉన్న వడ్డే శోభనాద్రీశ్వర రావుని కానీ , యలమంచిలి శివాజీ లాంటి నేతల్ని ఏ ఒక్క కీలక సందర్భంలో కూడా పరిగణనలోకి తీసుకొని సంప్రదించలేదు .

పోనీ టీడీపీ పిలిచి కలుపుకొని పోకపోయినా ఏ రోజైనా ఏ ప్రజా సమస్య పైనైనా ప్రతిపక్షాలు ప్రశ్నించినా , ఓ సమస్య పరిష్కరించమని కోరినా ఎదురుదాడి చేసి నోరు మూపించే ప్రయత్నం తప్ప వారి ప్రశ్నలు , సలహాలు , సూచనలు అధికార పార్టీ విన్న పాపాన పోలేదు . ఏ సమస్య పైనైనా ప్రతిపక్షం పోరాటం చేస్తే అసెంబ్లీలోనైనా , బయటైనా బలవంతంగా వారి గొంతు నొక్కారే తప్ప సావధానంగా విని పరిశీలించి పరిష్కరించిన సమస్య ఒక్కటంటే ఒక్కటైనా లేదన్నది కఠోర వాస్తవం .

ఇలా ప్రతి సారీ ప్రతి సమస్య పట్లా ప్రతిపక్షాల మాట వినకుండా , లెక్కచేయకుండా తృణీకరించి ఈ రోజు నేను అనుభవజ్ఞుణ్ణి నన్ను పిలవండి , నన్ను అడగండి , నన్ను సంప్రదించండి , నేను సలహాలిస్తాను అనే అర్హత బాబు గారికి ఉందని ఆయన అనుకోవచ్చు కానీ గత తొమ్మిదేళ్ళల్లో నాలుగేళ్లు టీడీపీ సహచర ప్రతిపక్ష నేతగా , ఐదేళ్లు అధికార టీడీపీ పార్టీకి ప్రతిపక్ష నేతగా చంద్రబాబుని దగ్గరగా గమనించిన జగన్ , టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పట్ల బాబు స్పందనను , వారు పాటించిన సాంప్రదాయాలను నిశితంగా గమనించిన మీదట ఏ విధమైన సమస్యల పరిష్కారానికీ ఆయన సేవలు పనికిరావనో , ప్రస్తుత కాలానికి చంద్రబాబులాంటి నాయకుల అవసరం లేదనో జగన్ భావించి ఉండొచ్చు .

మరోవైపు నిన్న ప్రధాని మోడీ సైతం జాతీయ , ప్రాంతీయ పార్టీల నాయకులకి పలువురికి ఫోన్లు చేసి కేంద్రం చేపడుతున్న చర్యలని వివరించారు కానీ , రెండు సార్లు ప్రధానుల్ని నిర్ణయించాను , దేశంలో నేనే సీనియర్ రాజకీయ నాయకుణ్ణి , నలభై ఏళ్ల అనుభవుఁజ్ఞుణ్ణి అని చెప్పుకునే బాబుకి మాత్రం ఫోన్ చేయలేదని టీడీపీ పార్టీ నేతలు , అనుకూల మీడియా బాధ పడింది కానీ కేంద్ర స్థాయిలో ఆయన గత చరిత్ర , ప్రవర్తన పరిశీలించిన వారికి ఎవరికీ ఆశ్చర్యం అనిపించదు .

గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు నెరిపిన చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలని నెరవేర్చకపోయినా ప్రశ్నించకుండా నాలుగేళ్లు బీజేపీతో సఖ్యతగా ఉండి ఎన్నికల ముందు రాష్ట్రంలో బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేకతను గణించి ఎన్డీయే నుండి ఎన్నికల ముందు బయటికొచ్చి జాతీయ స్థాయిలో కూడా ఏ పార్టీ విమర్శించని తీవ్ర భాషలో బీజేపీని , వ్యక్తిగతంగా మోడీని విమర్శించిన వైనం బీజేపీ నేతలు స్మృతిపథంలో ఇంకా మెదులుతూనే ఉండి ఉంటుంది .

బీజేపీకి ఓటేస్తే దేశద్రోహం చేసినట్టే అన్న తీవ్ర వ్యాఖ్యలు , ఎప్పటికప్పుడు స్వప్రయోజనాల కోసం కూటముల్ని మార్చే బాబు తత్వాన్ని గమనించిన జాతీయ పార్టీలు కూడా ప్రస్తుతం ఆయన్ని నమ్మి పరిగణనలోకి తీసుకొనే పరిస్థితి లేదన్నది , ప్రస్తుతం బాబుది ఆ స్థాయి కాదన్నది చంద్రబాబు , టీడీపీ నేతలూ గ్రహించాల్సిన కఠిన సత్యం .

ఏదేమైనా గతంలో జరిగిన ఘటనలు ఎలాంటివైనా ప్రస్తుతం ప్రతిపక్షాలతో సంప్రదించాలని పలు కీలక అంశాల పై చర్చించి తన అభిప్రాయం తీసుకోవాలని చంద్రబాబు కోరుకోవడం మాత్రం ఆశ్చర్యకరం . అయితే గతంలో చంద్రబాబు తీసుకొన్న చర్యల వలన ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి అయితే లేదనే చెప్పొచ్చు .