iDreamPost
iDreamPost
స్థానిక సమరం షురూ అవుతోంది. తొలుత జిల్లా, మండలి పరిషత్ నగారా మోగబోతోంది. ఆ తర్వాత మున్సిపల్ పోరు ఖాయంగా కనిపిస్తోంది. దాంతో రాష్ట్రమంతా ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. పార్టీలన్నీ అందుకు తగ్గట్టుగా సమాయత్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ఒంటరిగా బరిలో దిగుతోంది. టీడీపీ మళ్లీ చాలాకాలం తర్వాత వామపక్షాలతో సర్థుబాటు యత్నాల్లో ఉంది. ఇప్పటికే సీపీఐ అందుకు సిద్ధంగా ఉండడంతో ఆ రెండు పార్టీలు కలిసి బరిలో దిగడం ఖాయంగా చెప్పవచ్చు. ఇక జనసేన, బీజేపీ మిత్రత్వంలో మొదటిసారి కలిసిపోటీ చేయబోతున్నాయి. దాంతో ముక్కోణపు పోరు జరిగేలా కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో సత్తా చాటిన వైఎస్సార్సీపీని విపక్షాలు ఏమేరకు నిలువరించగలవన్నది ప్రశ్నార్థకంగానే చెప్పవచ్చు.
ఇక అందరి దృష్టి కీలకమైన కార్పోరేషన్ ఎన్నికలపై కనిపిస్తోంది ముఖ్యంగా నగర పాలకసంస్థల ఎన్నికల్లో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న విశాఖ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రాజధాని నగరం కావడంతో పాటుగా మొన్నటి ఎన్నికల్లో సిటీ పరిధిలోని అత్యధిక స్థానాలు టీడీపీ కైవసం చేసుకోవడం మరో కారణం. ఏపీలో ఎక్కడా లేని రీతిలో విశాఖ ఓటర్లు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఈసారి ఏవిధమైన తీర్పు ఇస్తారన్నది చర్చనీయాంశం అవుతోంది. ఏపీలోనే అతి పెద్ద నగర పాలకసంస్థగా ఉన్న జీవీఎంసీకి దశాబ్దకాలంగా ఎన్నికలు లేవు. పదే పదే పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు ప్రస్తుతం మోక్షం కలిగే అవకాశం ఉండడంతో ఓటరు తీర్పు ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరం. ఒకప్పుడు టీడీపీకి కొంత పట్టున్న నగరమే అయినప్పటికీ ప్రస్తుతం ఆపార్టీకి తీవ్ర ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మాజీ సిటీ అధ్యక్షుడు రెహమాన్ వంటి సీనియర్లు కూడా టీడీపీకి దూరం అయ్యారు. ఇక నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్సీపీ నేతలు దూకుడుగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక జనసేన, బీజేపీ లు ఈ ఎన్నికల్లో కనీసం ఉనికి చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమేరకు ప్రభావం చూపుతాయన్నది చూడాలి.
విశాఖ తర్వాత విజయవాడ, గుంటూరు నగర పాలక సంస్థలు కూడా ప్రధానమైనవిగా చెప్పవచ్చు. ఈరెండు నగరాల్లో కూడా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఉనికి చాటుకుంది. ఎంపీ సీట్లు గెలుచుకుంది. గుంటూరులో రెండు సీట్లకు ఒకటి, విజయవాడలో మూడు స్థానాలకు ఒకటి చొప్పున ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం అమరావతి అంశం హాట్ టాపిక్ గా మారిన తరుణంలో ఆయా నగరాల్లో ఓటర్లు ఏవిధమైన తీర్పు ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారబోతోంది. టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అంతో ఇంతో పట్టు ఉండడం, సామాజికంగా కొంత సానుకూలత ఉండడంతో సత్తా చాటాలని ఆపార్టీ ఆశిస్తోంది. కానీ నేతల్లో నిస్పృహ కనిపిస్తున్న సమయంలో ఏమేరకు ప్రతాపం చూపుతారన్నది చూడాలి. విజయవాడలో అధికార పార్టీకి చెందిన మంత్రి వెల్లంపల్లితో పాటు బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణుకి ఇది పరీక్షగా చెప్పవచ్చు. అదే సమయంలో గుంటూరు వైఎస్సార్సీపీ నేతలు కూడా పట్టుదలతో సాగుతున్నారు.
రాజమహేంద్రవరం కార్పోరేషన్ పై టీడీపీ గంపెడాశతో ఉంది. ఇప్పటి వరకూ ప్రతీ ఎన్నికల్లోనూ ఆపార్టీకే ఇక్కడ విజయం దక్కుతోంది. అంతేగాకుండా మొన్నటి సాధారణ ఎన్నికల్లో రూరల్, అర్బన్ సీట్లు రెండూ దక్కించుకుని సైకిల్ జోష్ లో ఉంది. వైఎస్సార్సీపీ వర్గపోరు టీడీపీకి ఊతమిస్తోంది. అధిష్టానం ప్రయత్నించినా అక్కడా పాలకపక్షానికి ఎదురీత తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది. కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాకి అధిష్టానం ముందు పట్టు నిలబడాలంటే ఈ కార్పోరేషన్ కైవసం చేసుకోవడం ముఖ్యం అని అంతా భావిస్తున్నారు.
ఇక ఒంగోలు, ఏలూరు, నెల్లూరు, శ్రీకాకుళం వంటి స్థానాల్లో టీడీపీ ఏమేరకు పోటీ ఇవ్వగలుగుతుందన్నది సందేహాస్పదంగా ఉంది. ఆపార్టీ ఈ ఎన్నికలకు తగ్గట్టుగా సన్నద్ధం అయినట్టు కనిపించడం లేదు. అదే సమయంలో పాలకపక్షానికి ఉన్న సానుకూలత తో చాలామంది టీడీపీ నేతలు సైలెంట్ అయిపోతున్నారు. ఇక రాయలసీమలో ఉన్న కర్నూలు. అనంతపురం, కడప, తిరుపతి, చిత్తూరు కార్పోరేషన్లలో కూడా అధికార పార్టీకి ఎదురొడ్డి ఏమేరకు నిలబడగలరన్నది టీడీపీకి అత్యంత క్లిష్టమైన పరీక్షగా భావిస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని ఐదారు కార్పోరేషన్లలో మినహా మిగిలిన చోట్ల ఏకపక్షంగానే ఫలితాలు ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. వాటిపైనే విపక్షం గంపెడాశతో కసరత్తులు చేస్తోంది. జగన్ సంక్షేమ మంత్రం ఫలిస్తుందా లేక విపక్షం ఆశిస్తున్నట్టు ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిఫలిస్తుందా అన్నది చూడాలి.