కరోనా చెప్పిన పాఠం.. ఇకనైనా తలకెక్కుతుందా..?

చైనా, అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, కెనడా దేశాల్లోలాగా కరోనా వైరస్‌ భారత్‌లో విజృంభించి ఉంటే మన పరిస్థితి ఏమిటి..? అభివృద్ధి చెందిన ఆయా దేశాలే కరోనా వైరస్‌ను కట్టడి చేయలేక, బాధితులకు వైద్య సదుపాయాలు అందించలేక అతలాకుతలం అవుతున్నాయి. ఆరు కోట్ల జనాభా ఉన్న ఇటలీ చిగురుటాకులా వణికిపోతోంది. మరి 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ను ఆ స్థితిలో ఊహించుకుంటేనే ఒళ్లుజలదరిస్తోంది. కొంత మంది అనుకుంటున్నట్లు పుణ్యఫలమో, దైవ బలమో లేదా ప్రభుత్వాల ముందు చూపుతో లాక్‌డౌన్‌ చర్య వల్లనో భారత్‌దేశం కొంత మెరగైన పరిస్థితిలో ఉంది. లేదంటే మన పరిస్థితి ఏమిటి..?

వందేళ్లకోసారి ఇలాంటి వైరస్‌లు వచ్చి ప్రజలను బలితీసుకుంటున్నాయ. అప్పట్లో కలరా వ్యాధి వచ్చి జనం పిట్టాల్లా రాలిపోయారని చెబుతున్నారు. మధ్యలో సార్క్, స్వైన్‌ఫ్లూ, జికా లాంటి వైరస్‌లు వచ్చినా అప్పటి కలరా, ఇప్పటి కరోనా వైరస్‌ స్థాయిలో మానవ జాతిపై ప్రభావం చూపలేదు. కలరా స్థాయిలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దీని నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మన ముందున్న అవకాశాలేమిటి..? వైద్య సదుపాయాల మాటేమిటి..? అంటే పాలకులు నీళ్లు నమలాల్సిందే.

కరోనా భారత్‌లోకి వచ్చిన తర్వాత, లాక్‌డౌన్‌ చేసిన మూడు రోజులకు దేశంలో వైద్య సదుపాయాలు, డాక్టర్లకు శిక్షణకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇక్కడ వైద్య సదుపాయాలంటే… చైనా కట్టినట్లు కొత్త ఆస్పత్రులు కాదు, కొత్త వెంటిలేటర్లు సమకూర్చుకోవడం కాదు.. మాస్కులు, సానిటైర్లు, ఇతర రక్షణ సామాగ్రి అని పాఠకులు అర్థం చేసుకోవాలి. మన ప్రభుత్వాస్పత్రుల్లో ఇనుప బెడ్లపై పరుపులు ఉండవు. బాత్‌రూమ్‌లలో సానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌లు, సబ్బులు కాదు కదా.. ఫినాయిల్‌ కూడా అందుబాటులో ఉండదు. ప్రజలకు అవసరమైన రెండు రంగాలు.. విద్య, వైద్యం. ఈ రెండు కూడా అఖండ భారతావనిలో ప్రవేటు, కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోనే ఉన్నాయని అందరికీ తెలిసిందే అయినా ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకోవాలి.

కరోనా వైరస్‌ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది తప్పా.. ఎక్కడా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులు కనిపించడం లేదు. కనీసం ఆయా సంస్థల పేర్లు కూడా వినపడడంలేదు. మేమున్నామని వారు ముందుకు రావడంలేదు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. రండి చేయి చేయి కలిపి పోరాడదాం.. అని ప్రభుత్వాలు కార్పొరేటర్‌ ఆస్పత్రులను పిలవడంలేదు. కారణాలేమిటో కానీ మోదీ గానీ రాష్ట్రాల సీఎంలు గానీ ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల సహాయం అడగడంలేదు. జ్వరం, దగ్గు, జలుబులకు సూది మందులు, గోలీలు ఇచ్చే ప్రాధమిక, సామాజిక, ఏరియా ఆస్పత్రులనే కరోనా మహమ్మరిని ఎదుర్కొనేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న వార్డులలోని బెడ్లనే కరోనా అనుమానిత బాధితులను క్వారంటైన్‌ చేసేందుకు ఉపయోగించుకుంటున్నారు. రైల్వే బోగీలను ఆస్పత్రులుగా మార్చుకుంటున్నారు.

కరోనా వైరస్‌ ప్రభుత్వ వైద్య రంగం పరిస్థితిని తేటతెల్లం చేసింది. మీ పరిస్థితి ఇదీ నాయకా అంటూ పాఠం చెప్పింది. తాను జూలు విదిల్చితే తట్టుకోలేరని గుణపాఠం నేర్పింది. మరి ఇప్పటి నుంచైనా పాలకులు ప్రభుత్వ వైద్య రంగంపై దృష్టి పెడతారా..? ప్రతి మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో ఉన్న ఆస్పత్రులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్తవాటిని నిర్మించుకోవాలి. సకల సౌకర్యాలు, మౌలిక సదుపాయలు కల్పించాలి. ఏపీలో ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసేందుకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నాడు–నేడు కార్యక్రమంలా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేసుకోవాలి. కరోనా లాంటి మహమ్మరి వస్తే.. పైకి చూసి దణ్నం పెట్టే పరిస్థితి మళ్లీ రాకుండా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ దిశగా ప్రభుత్వాలు సీరియస్‌గా ఆలోచించి, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి అమలు చేయాలి. లేదంటే భారీ మూల్యం తప్పదు.

Show comments