iDreamPost
android-app
ios-app

ఏపిలో పారిశ్రామిక పరుగులు – మరో ఐదు పారిశ్రామిక పార్కులు

ఏపిలో పారిశ్రామిక పరుగులు – మరో ఐదు పారిశ్రామిక పార్కులు

దేశంలో కరోనా వైరస్ లాక్ డౌన్ తో అన్ని రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఒకవైపు ఆర్థికంగా ఇబ్బందులు, మరోవైపు నిరుద్యోగం ఇలా రెండు రకాల పారిశ్రామిక వృద్ధి పడిపోయింది. అయితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ త్వరగా కోలుకొని ఒకవైపు సంక్షేమ పాలన కొనసాగుతుంటే…మరోవైపు పారిశ్రామిక పరుగులు పెడుతుంది. ఇప్పటికి రెండు సెల్ ఫోన్ తయారీ యూనిట్లు, రాష్ట్రంలో అదాని గ్రూప్ పెట్టుబడులు, ప్రతిష్ఠాత్మక కార్లు కంపెనీ కియా పెట్టుబడి పెంచడం వంటి పారిశ్రామిక నిర్ణయాలు జరిగాయి. ఇవన్నీ లాక్ డౌన్ తరువాత జరిగినవే. తాజాగా మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ శ్రీసిటీ తరహాలో అన్ని వసతులతో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తుంది.అంటే వైఎస్ జగన్ పాలన ఏరకంగా ముందుచూపుతో పయనిస్తోందో అర్థం అవుతుంది.

భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన మల్టీ ప్రొడక్ట్‌ సెజ్‌ ‘శ్రీసిటీ’ తరహాలో అన్ని వసతులతో ఐదు పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తోంది.

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి అధ్యక్షతన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ భేటీలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్, టాస్క్‌ఫోర్స్‌ సిఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, పంచాయతీ రాజ్, మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, విద్యుత్‌ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఐదు డిజిగ్నేటెడ్‌ క్లస్టర్స్, పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా రక్షణ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, హెల్త్‌కేర్, టెక్స్‌టైల్‌ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా అన్ని వసతులతో డిజిగ్నేటెడ్‌ క్లస్టర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్లగ్‌ అండ్‌ ప్లే విధానంలో విదేశీ కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించుకునే విధంగా ఈ క్లస్టర్స్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. సిఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన ఉండే స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపిబి) ముందుకు నేడు వచ్చే సుమారు రూ.18,000 కోట్ల విలువైన 25 పెట్టుబడి ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నారు.