సెన్సార్లు అవుతున్నాయి కానీ

ఇంకా షూటింగులు మొదలుకాలేదు కానీ లాక్ డౌన్ కు ముందు ఫస్ట్ కాపీలు సిద్ధం చేసుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు తెచ్చేసుకుంటున్నాయి. రెండు వారాల ముందే అనుష్క ‘నిశబ్దం’ యు/ఎ తెచ్చుకోగా తాజాగా సత్యదేవ్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కూడా ఇదే క్యాటగిరిలో ధృవీకరణ అందుకుంది. మరోవైపు సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తమిళ్ లో ఈ తతంగం పూర్తి చేసుకుంది. తెలుగు వెర్షన్ కూడా రేపో ఎల్లుండో జరిగిపోతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కాని థియేటర్లు తెరవగానే ఖచ్చితంగా ఇవే విడుదల అవుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఇవి ఇంత త్వరగా సెన్సార్ పూర్తి చేసుకోవడంలో ఇంకో లాజిక్ ఉంది. ఒకవేళ ఓటిటి రిలీజ్ కు సై అంటే ఇది వెబ్ మూవీగా కాకుండా డైరెక్ట్ సినిమాగా ప్రమోట్ చేసుకోవచ్చు. దాని వల్ల శాటిలైట్ డీల్ కు చాలా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా నేరుగా డిజిటల్ లో విడుదల చేస్తే ఛానళ్ళు రేట్ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందస్తు సేఫ్ గేమ్ లో భాగంగా ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలిసింది. ఇక్కడ మరో గమనించాల్సిన అంశం ఉంది. ఇప్పుడు సెన్సార్ పూర్తి చేసుకుంటున్న సినిమాలన్నీ ఓటిటిలో రావోచ్చనే బలమైన టాక్ ఉన్నవే. ఆయా నిర్మాతలు అఫీషియల్ గా ఎక్కడా చెప్పడం లేదు కాని వీటికి సంబంధించిన ప్రచారమైతే జోరుగా సాగుతోంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫైనల్ కట్ రెడీ చేశారు. రెండున్నర గంటలకు కుదించేసి రేపో ఎల్లుండి చిరంజీవికి స్పెషల్ షో వేసి ఆ తర్వాత సెన్సార్ కు వెళ్తారట. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ థియేట్రికల్ రిలీజ్ కే టీం కట్టుబడి ఉంది. ఇక అరణ్య కూడా తన స్టేటస్ చెప్పాల్సి ఉంది. రెడ్ కూడా అంతే. మొత్తానికి ఏదో ఒక కదలిక అయితే ఇండస్ట్రీలో మొదలైంది. జూన్ మూడో వారం నుంచి షూటింగులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ ఉన్న సినిమాలన్నీ ఆ పనులను పూర్తి చేసుకుంటాయి. హాళ్ళు మొదలయ్యే సమయానికి కనీసం 15 సినిమాలు రెడీ ఫర్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. కాని ఎవరు ముందు వస్తారు ఎవరు తర్వాత వస్తారు అనేదే సస్పెన్స్. అప్పటిదాకా ఈ సెన్సార్ అప్డేట్స్ మాత్రమే వచ్చేలా ఉన్నాయి

Show comments