iDreamPost
iDreamPost
ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును ప్రతిపక్షాలు తీరని దెబ్బ కొట్టాయి. స్కూళ్ళల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు మొదటి నుండి వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇక్కడ విషయం ఏమిటంటే నిర్ణయం తీసుకున్నది జగన్ కాబట్టి కచ్చితంగా వ్యతిరేకించాల్సిందే అనే ధోరణే ప్రతిపక్షాల్లో కనబడుతోంది. అంతేకానీ తాము వ్యతిరేకించటం వల్ల ఇంగ్లీషుమీడియంలో చదవాలనుకునే విద్యార్ధుల ఆశలకు గండి కొడుతున్నామన్న విషయాన్ని మరచిపోయాయి. ప్రతిపక్షాలకు ఎల్లోమీడియా బాహటంగానే వత్తాసు పలుకుతున్నాయి.
జగన్ మీదున్న వ్యతిరేకతతో ప్రతిపక్షాలు లక్షలాదిమంది విద్యార్ధుల ఆశలపై నీళ్ళు చల్లాయనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయంతో విభేదించిన ప్రతిపక్షాలు ఆచరణాత్మకమైన సలహాలు, సూచనలు చేసుంటే బాగుండేది. కానీ ఏకమొత్తంగా అసలు నిర్ణయాన్నే తప్పు పట్టటంతోనే సమస్య ముదిరిపోయింది. ఎప్పుడైతే వచ్చే విద్యాసంవత్సరం నుండి ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందో వెంటనే బిజెపి అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల కోర్టులో కేసు వేశాడు. గుంటుమల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా కేసు వేశాడు లేండి. వీళ్ళలో రాంబొట్ల వెనక చంద్రబాబునాయుడు ఉన్నాడనే ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి.
ప్రభుత్వం నిర్ణయాన్ని హై కోర్టు కొట్టేయటంతో సుమారు 40 లక్షల మంది విద్యార్ధులకు ఇంగ్లీషులో చదువుకునే అవకాశం దూరమైపోయింది. కోర్టు తాజా ఆదేశాలతో జగన్ కు నష్టం ఏమీ లేకపోయినా లక్షలాదిమంది విద్యర్ధులకు మాత్రం తీరని నష్టమే జరుగుతోంది. రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్ళ నుండి హై స్కూళ్ళ వరకూ 46 వేలున్నాయి. మొత్తం స్కూళ్ళల్లో సుమారు 76 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఇందులో 1-7వ తరగతి వరకు స్కూళ్ళు 4200, 6-10 వరకు ఉండే హై స్కూళ్ళు 4650 ఉన్నాయి. ఇవికాకుండా 1-5 వరకున్న స్కూళ్ళు సుమారు 37 వేలున్నాయి.
1-6 వరకూ ఉన్న స్కూళ్ళల్లో సుమారు 40 లక్షల మంది చదువుకుంటున్నారు. జగన్ నిర్ణయం వల్ల వచ్చే విద్యా సంవత్సరం నుండి వీళ్ళంతా ఇంగ్లీషుమీడియంలో చదువుకోవాలి. కానీ కోర్టు ఆదేశాల వల్ల ఇపుడు వాళ్ళ ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. సరే హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రింకోర్టుకు వెళుతుందా లేదా అన్నది వేరే సంగతి. ఇప్పుడైతే ఇంగ్లీషుమీడియంకు బ్రేకులు పడినట్లే.
ఇదే విషయమై స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఎంఎల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీషుమీడియ ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. కాకపోతే ఒకేసారి వేలాది స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టేబదులు ముందుగా ఏదైనా జిల్లాలోనో లేకపోతే మండలంలోనో ప్రయోగాత్మకంగా ఒకటి, రెండు స్కూళ్ళల్లో ప్రవేశపెట్టుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇంగ్లీషు మీడియంలో చదువుకోవటం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవని కత్తి నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిర్ణయం తీసుకున్నది జగన్ కాబట్టి ప్రతిపక్షాలు ఎల్లోమీడియా రెచ్చిపోతున్నాయి. ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకునుంటే ఎల్లో మీడియా ఎలా స్పందించి ఉండేదో తెలిసిన విషయమే…