iDreamPost
iDreamPost
పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేవు. అన్నింటా ఆర్థిక గండాలు పొంచి ఉన్నాయి. ప్రభుత్వాలు, బడా కార్పోరేట్ సంస్థలు కూడా సతమతం కావాల్సి వస్తోంది. కరోనా, లాక్ డౌన్, వాటికి ముందు నుంచీ పొంచి ఉన్న ఆర్థిక మాంధ్యం కలిసి ఇప్పుడు వ్యవస్థను కుదేలు చేస్తున్నాయి. గత కొన్ని క్వార్టర్స్ లో తిరోగమనంలో ఉన్న జీడీపీ వృద్ధి రేటు చివరకు మైనస్ లోకి మారుతోంది. ఆర్థిక అంధకారం అస్తవ్యస్తంగా తయారుకావడంతో ఇప్పటికే వేతనాల కోత, సిబ్బంది తగ్గింపు, చివరకు పలు సంస్థల మూత వంటి సవాలక్ష సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లోనో, ఒక్క భారతదేశంలోనో మాత్రమే కాకుండా విశ్వమంతా విస్తరించడంతో దాదాపుగా అన్ని దేశాలు విలవిల్లాడతున్నాయి . ఇంతటి విపత్తు ముంచుకొస్తుందోనన్నది అంతుబట్టని అంశంగా మారింది.
మాంధ్యం ముంచుకొస్తున్న వేళ మోడీ, జగన్ ప్రభుత్వాలు భిన్నమైన దారుల్లో సాగుతున్నాయి. మోడీ ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఆడంబరం చేసినప్పటికీ దాని తాలూకా అసలు లక్ష్యం నెరవేరినట్టుగా లేదు. ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించే రీతిలో లేకపోవడంతో చాలామంది పెదవి విరిచారు. కానీ జగన్ ప్రభుత్వం దానికి విరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. పారిశ్రామిక సంస్థలకు మాత్రమే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా నేరుగా ప్రయోజనం కలిగించే దారిలో వెళుతోంది. సంక్షేమ చర్యలను ముమ్మరం చేసింది. కష్టకాలంలో కూడా వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, వీలయినంత వరకూ సామాన్యుడికి చేదోడుగా ఉండేలా పథకాలను అమలు చేస్తోంది.
రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ జగన్ ధోరిణి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు అనుగుణంగా పంపిణీలు సాగిస్తున్న జగన్ ప్రయత్నాలు మార్కెట్ కి ఊపునిస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. తద్వారా ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించడంతో పాటుగా మార్కెట్ ని నిలబెట్టే ప్రయత్నం కూడా ఏకకాలంలో జరుగుతోందని ఆర్థికరంగ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు నగదు బదిలీ ద్వారా వారిని ప్రోత్సహించడం, మార్కెట్ లో కార్యకలాపాలకు అవకాశం కల్పించడం వంంటి ద్విముఖ వ్యూహం ఫలిస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది అమ్మ ఒడి పథకం నిధులు ప్రజలకు అందగానే సంక్రాంతికి వారం రోజుల ముందుగా ఊపందుకున్న మార్కెట్ ని ఉదాహరణగా చెబుతున్నారు. కార్పోరేట్లకు ఇచ్చే రాయితీలు నేరుగా మార్కెట్ కి వస్తాయా రావా అనే ప్రశ్నలు ఉన్నప్పటికీ సామాన్యుడికి అందించే ప్రతీ పైసా మళ్లీ మార్కెట్ లోకి తరలిరావడం ఖాయమని చెబుతున్నారు. తద్వారా వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కరోనా కారణంగ లాక్ డౌన్ తో రెండు నెలలకు పైగా ఉపాధి లేదు. అనేక మందికి ఉద్యోగాలు కూడా ధీమా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కొత్త వస్తువుల కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. కానీ ప్రభుత్వం సామాన్యులకు నగదు బదిలీ మూలంగా వారిని మార్కెట్ కి రావడానికి మార్గం సుగమం చేస్తున్నారు. తద్వారా ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తున్నారు. వ్యాపారాలు సాగడం లేదని ఛాంబర్ వర్గాలు చతికిలపడకుండా, సరుకులు కొనలేకపోతున్నామని సామాన్యులు వాపోకుండా అన్ని వర్గాలకు ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో మార్కెట్ లేకపోతే ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున, మొత్తం పారిశ్రామికరంగమే కుదేలయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల మూలంగా అలాంటి పరిస్థితి రాకుండా కొనుగోళ్లు, అమ్మకాలను కొనసాగించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
గత పక్షం రోజులుగా మార్కెట్ పరిస్థితిని పరిశీలించినప్పటికీ జగన్ పథకాల ప్రభావం కనిపిస్తోందని చాలామంది చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణా, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మార్కెట్ కొంత స్థిరత్వాన్ని సాధించే దిశలో ఉండడానికి ఈ పథకాల తోడ్పాటు ఉందని చెబుతున్నారు. ఏమయినా ఆర్థిక వ్వవస్థ మళ్లీ గాడిలో పడే వరకూ ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నేరుగా ప్రజలకు సహాయం అందించే చర్యలు మరిన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ అనుభవం చాటుతోంది. దేశమంతా అలా జరిగితే మరింత మెరుగవుతుందని కూడా ఆర్థిక వేత్తల అభిప్రాయం.