iDreamPost
iDreamPost
ఏపీలో జగన్ ప్రభుత్వం మరోసారి ఉదారంగా వ్యవహరిస్తోంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చాటుతోంది. చెప్పిన దానికి మించి సహాయక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా కరోనా విపత్తు వేళ ప్రజలకు తోడుగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు ఆర్థిక వ్యవస్థ సహకరించకపోయినా ప్రజలకు మాత్రం అవకాశం ఉన్నంత మేరకు అండగా నిలవాలని ఆశిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో మరో విడతకు శ్రీకారం చుట్టింది.
వాస్తవానికి ఏపీ ప్రభుత్వం మూడు విడతల్లో ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించింది. దానికి అనుగుణంగా మార్చి నెలాఖరులో మొదటి విడత బియ్యం. కందిపప్పు అందించింది. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలలో రెండు సార్లు పంపిణీ చేపట్టింది. ఇప్పుడు మే నెల మూడో వారంలో మరోసారి ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభించింది.
రేషన్ కార్డ్ ఆధారంగా మనిషికి 5 కిలోల చొప్పున పిడిఎఫ్ బియ్యం, కేజీ శనగలు పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు పంపిణీ చేసినట్టు తెలిపింది. ఈ పంపిణీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని వెల్లడించింది. రాష్ట్రంలో బియ్యంకార్డు వున్న కుటుంబాలు 1,47,24,017 లతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862లకు కూడా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ అందించబోతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ల వినియోగం ద్వారా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
దేశంలోని వివిద రాష్ట్రాలతో పోలిస్తే రేషన్ కార్డు ఉన్న వారికి జగన్ ప్రభుత్వం భరోసా కల్పించేలా ఉచితంగా చేపట్టిన పంపిణీ కార్యక్రమం పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ఓ వైపు ఉపాధి లేకపోవడం, మరోవైపు ఆదాయం లేక అవస్థలు పడుతున్న సమయంలో ఉచితంగా రేషన్ అందించడం ద్వారా కడుపు నింపే ప్రయత్నం ఆదర్శనీయంగా ఉందని చెబుతున్నారు.