కర్ణాటకలోనూ రాజధాని వికేంద్రీకరణ !!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని వికేంద్రీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష టిడిపి,జనసేన, కాంగ్రెస్ , ఇంకా లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తుండగా పొరుగునున్న కర్ణాటక మాత్రం జగన్ సూత్రాన్ని అనుసరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ దిశగా బిజెపి పాలిత కర్ణాటక ముందుకు సాగుతోంది.

బెంగళూరు నుంచి కొన్ని ముఖ్య కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుకు అక్కడి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల కోసం ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహాన్నిచ్చే అంశమిది.

అమరావతిలో లెజిస్లేటివ్, విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూల్ లో జ్యుడీషియల్ రాజధానుల ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనలను విపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో బీజేపీ నిర్ణయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలకు జీవం పోసినట్టవుతుందని భావిస్తున్నారు. ఇక కర్ణాటక ముఖ్య మంత్రి యడ్యూరప్ప ఈ విషయంలో ముందుకు సాగుతున్నారు. దక్షిణ కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో ముఖ్యమైన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆయన భవిస్తూ మంత్రులకు అధికారులకు కూడా దిశా నిర్దేశం చేస్తున్నారు.

Show comments