Idream media
Idream media
తల్లడిల్లుతున్న ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ కరోనా టెర్రర్ తో తల్లడిల్లుతోంది. ఆప్ సర్కారును కుదిపేస్తోంది. రాజకీయంగా కూడా ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మోదీ హోరు గాలిలోనూ విజయ కేతనం ఎగురువేసిన ఆప్.. ఇప్పుడు కరోనా కోరల్లో నలిగిపోతోంది. ఒక వైపు పెరుగుతున్న రోగులు… మరోవైపు ప్రతిపక్షాల విమర్శలు.. దీనికి తోడు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆప్ సర్కారును కలవరపరుస్తున్నాయి. ఇప్పటి వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 42 వేలకు చేరువవుతోంది. దేశంలో నమోదైన కరోనా మరణాల్లో దాదాపు 75 శాతం గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల లోనే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
ఒక్క ఢిల్లీలోనే మరణాల సంఖ్య 1400కు చేరువవుతోంది. శవాల భద్రత, ఖననం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. సుప్రీం కోర్టు కూడా ఢిల్లీ సర్కారుపై సీరియస్ అయింది. కొవిడ్ మృతదేహాలను చెత్త కుప్పల్లో వేస్తారా.. అంటూ గట్టిగానే మందలించింది. రోగుల సేవలు.. మృతదేహాల నిర్వహణల తీరుపై ఆక్షేపణలు వ్యక్తం చేసింది. కరోనా రోగులను పశువుల కన్నా హీనంగా చూస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ తీర్పునకు ముందే.. ఢిల్లీ సర్కారు ఓ నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న రోగుల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి వైద్య సహాయంపై చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఢిల్లీకి చెందిన వారికే వైద్యం అందించాలని కేజ్రీవాల్ ఆదేశాలు ఇచ్చారు. అయితే.. ఈ ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తోసిపుచ్చారు. రోగంతో వచ్చిన వారు ఇక్కడి వారా.. వేరే రాష్ట్రానికి చెందిన వారా.. అని చూడకుండా వైద్యం అందించాల్సిందే అన్నారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ మంటలు చెలరేగాయి. బీజేపీ ఒత్తిడితోనే ఆయన అలా చేశారని ఆప్ ఆరోపించింది.
అది కాస్త చల్లారకుండానే… ఇటీవల బీజేపీ మరోసారి ఆప్ సర్కారుపై విమర్శల వర్షం కురిపించింది. కరోనా విషయంలో కేజ్రీవాల్ సర్కారు సక్రమంగా పని చేయడం లేదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఆసుపత్రుల్లో బెడ్లు లేవని, రోగులకు సరైన చికిత్స అందడం లేదని ఆరోపించారు. ఢిల్లీలోని చెత్తకుప్పల్లో కొవిడ్ మృతదేహాలు బయటపడుతున్నాయని, సుప్రీం కోర్టు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. కరోనాపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ పెద్దలు నేరుగా ఆస్పత్రులకు వెళ్లి పరిస్థితులను తెలుసుకోవాలని, మీటింగ్ లు, ప్రకటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ కుమార్ గుప్తా కూడా కరోనా కట్టడిలో కేజ్రీ సర్కారు పూర్తి స్థాయిలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఆయన కూడా సర్కారు తీరుపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలను గుర్తు చేశారు. దీనికి ఆప్ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. ప్రజల ఆరోగ్యంతో రాజకీయాలు చేసే పార్టీ తమది కాదంటూ సమాధానాలిచ్చారు.
నేతల మధ్య వివాదాలు ఇలా ఉంటే.. ప్రభుత్వాల పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి సమష్టిగా పనిచేస్తుండడం కాస్త శుభ పరిణామం.
తాజాగా సీఎం కేజ్రీవాల్ తో సమావేశమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఇందు నిమిత్తం కేంద్రం నుంచి ప్రత్యేక అధికార బృందాన్ని నియమించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆ బృందం పరిశీలించి తగు సూచనలను ఇవ్వనుంది. వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు కేంద్రం సూచనలకు అనుగుణంగా నడుస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రకటించారు. అలాగే మరోసారి లాక్ డౌన్ అంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
ఏదేమైనప్పటికీ ఈ కరోనా కేసులు అన్ని ప్రభుత్వాలనూ కలవర పెడుతున్నా.. ఆప్ సర్కారుకు మాత్రం మరింత ఎక్కువనే చెప్పాలి. దేశ రాజధాని కావడం.. కేంద్రంలోని ప్రముఖులకు నిలయం కావడం.. సర్కారుపై నిప్పులు చెరిగేందుకు బీజేపీ లో చాలా మంది కాసుకు కూర్చుని ఉండడం దీనికి కారణాలుగా చెప్పవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేజ్రీవాల్ తో సమావేశమై కలిసి కట్టుగా పని చేస్తామనడం ప్రకటించడంతో రాజకీయ పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.