iDreamPost
iDreamPost
కరువులో అధికమాసమంటే ఇదేనేమో. జనాలు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం దాదుపు 50 రోజులుగా కరోనా వైరస్ దెబ్బకు నానా అవస్తలు పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే గురువారం స్టైరైన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జనాలు, యంత్రాంగం నెత్తిన పిడుగుపాటు లాగ వచ్చిపడింది. కరోనా వైరస్ సోకిన బాధితులకు, లక్షణాలున్న వారికోసం విశాఖపట్నం నగరంలో రెడి చేసిన క్వారాంటైన్ కేంద్రాలు, ఐసొలేషన్ వార్డులను గ్యాస్ బాధితులకోసం వాడాల్సొచ్చిందిట.
హఠాత్తుగా జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో బాధితులను యంత్రాంగం ముందు వివిధ ఆసుపత్రులకు తరలంచింది. కింగ్ జార్జ్ ఆసుపత్రి, గవర్నమెంటు ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ పథకంలో లిస్టయిన ఆసుపత్రుల్లో కూడా బాధితులను చేర్పించేశారు. ఒక్కసారిగా దాదాపు వెయ్యిమంది బాధితులకు చికిత్స అందించాలంటే మామూలు విషయం కాదు. తెల్లవారుజామున సుమారు 4 గంటల నుండి ఉదయం దాదాపు 8 గంటల వరకు గ్యాస్ లీక్ అవుతునే ఉంది. అందుకనే ఒకేసారి కొన్ని వందల మంది అనారోగ్యం పాలయ్యారు.
ఈ మొత్తంలో బాధితులను ఆదుకోవటంలో జిల్లా యంత్రాంగం చూపించిన చొరవ ప్రశంసనీయమనే చెప్పాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, విశాఖపట్నం కమీషనర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నధికారులు, ఫైర్ ఫైటర్స్ అందరూ తమ సిబ్బంది మొత్తాన్ని రంగంలోకి దింపేశారు. విషయం తెలియగానే చుట్టు పక్కలున్న ఐదు గ్రామాలకు పదుల సంఖ్యలో అంబులెన్సులను పంపారు. గ్యాస్ లీకేజి నుండి తప్పించుకునేందుకు అవకాశం ఉన్న వారు కార్లు, టూ వీలర్లలో దూరంగా వెళ్ళిపోయారు. అవకాశం లేని వాళ్ళు పరుగెత్తారు. అయితే గ్యాస్ ప్రభావాన్ని తట్టుకోలేక రోడ్లపై పరుగెట్టిన వాళ్ళు పరుగెడుతునే పడిపోయారు.
ఇటువంటి వారికోసం యంత్రాంగం చుట్టు పక్కల గ్రామాల్లో తిరిగి రోడ్లపై పడిపోయిన వాళ్ళని వెంటనే ఆసుపత్రుల్లో చేర్చారు. మొత్తం మీద బాధితులను ఆసుపత్రులకు చేర్చటంలో యంత్రాంగానికి జనాలు బాగా సహకరించారు. దాదాపు 50 అంబులెన్సులు నిర్విరామంగా గంటలసేపు గ్రామాలకు, ఆసుపత్రులకు మధ్య తిరుగుతునే ఉన్నాయట. ఏదేమైనా ఒకవైపు కరోనా వైరస్ సమస్య మరోవైపు గ్యాస్ లీక్ ఘటన విశాఖ యంత్రాంగాన్ని టెన్షన్ పెట్టేస్తోందనే చెప్పాలి.