iDreamPost
android-app
ios-app

ఇదీ.. ఏపీ సీఎం జగన్ భరోసా

ఇదీ.. ఏపీ సీఎం జగన్ భరోసా

పరిస్థితులు అనుకూలించనప్పుడు….యుద్ధ రంగంలో వీరుడు భయపడకూడదు వ్యూహాలను, ఎత్తుగడలను మార్చుకోవాలి, క్రీడాకారుడు ఆందోళన చెందకూడదు పంథాను మార్చుకోవాలి, అలాగే వ్యక్తులు, వ్యవస్థలు నీరుగారిపోకూడదు

    …ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, ఆయన ఆలోచనా విధానం చూస్తుంటే ప్రత్యామ్నాయాలను వెతకడమే కాకుండా ప్రజాలనూ ఆ దిశగా నడిపిస్తున్నట్లు అనిపిస్తోంది. 

భయం వద్దు… అవగాహనే ముద్దు

కరోనా నియంత్రణలో తొలి నుంచీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో సానుకూల ధోరణే కనిపిస్తోంది. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికర్థమయ్యే రీతిలో చెప్తూనే భయపడాల్సిన పనిలేదంటూ భరోసా ఇస్తూ వస్తున్నారాయన. తాజాగా సోమవారం మరోసారి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జగన్..కరోనాపై వాస్తవిక దృక్పథం ప్రదర్శించారు. కరోనాను ఎదుర్కొంటూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని ప్రజలకు విడమరచి చెప్పారు. కరోనాను పూర్తిగా నిర్మూలించటం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని… జాగ్రత్తలు తీసుకుంటూ దానితో ఇంకొన్ని రోజులు ప్రయాణిస్తూ పోరాడాల్సిన అవసరాన్ని నిజాయితీగా ప్రజల ముందుచారు.

అంటు వ్యాదే… అంటరానిది కాదు

అవగాహన లేమి కారణంగా కరోనా బాధితులు, మృతలు, వారి బంధువుల పట్ల సమాజంలో ఒక విధమైన వ్యతిరేకత వచ్చింది. దీన్ని గమనించిన ముఖ్యమంత్రి కరోనా అనేది…ఫ్లూ, చికెన్ ఫాక్స్ తరహాలో ఓ అంటు వ్యాధని…రేపది నాకైనా రావొచ్చని…కాబట్టి కరోనా బాధితుల పట్ల ఎవరూ కఠినంగా వ్యవహరించొద్దని కోరారు. అలాగే సమాజంలోని ఆయా వయోవర్గాల వారిపై కరోనా ప్రభావం, చికిత్సల గురించి రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. దీంతోపాటు ప్రజల్లో అనవసర భయాలను పారదోలేలా రాష్ర్టంలో ఇన్ఫెక్షన్ శాతం, మరణాలు, భవిష్యత్తు ప్రణాళికలకు సంబధించిన వాస్తవాలను ప్రజల ముందుంచారు. దీనికి ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పక అభినందించి తీరాల్సిందే.

మీడియా, ప్రతిపక్షం

ఓ వైపు వైఎస్ జగన్ సానుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల్లోని ఆందోళనలను తొలగించేందుకు ప్రయత్నిస్తుంటే…రాష్ట్ర మీడియా(అధిక శాతం), ప్రతిపక్షాలు మాత్రం వారిని భయకంపితులను చేస్తున్నాయని చెప్పొచ్చు. వైరస్ విజృంభణ…ఏపీలో కరోనా విలయతాండవం అంటూ కొంతమంది ప్రతికాధినేతలు, రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారంతో పాలు, పెరుగు తెచ్చుకోవడానికి సైతం ప్రజలు భయపడే పరిస్థితులు తలెత్తాయి. ఈ రోజు విషయానికే వస్తే ఒక పత్రిక ముఖ్యమంత్రి చెప్పిన మంచి విషయాలన్నిటినీ పక్కన పెట్టి ఓ చిన్న జ్వరం అంటూ సెటైరికల్ హెడ్డింగ్ పెట్టింది. దాని పక్కనే ‘తాళం తీయొద్దు’ అనే హెడ్డింగ్ తో ఇతర రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ఎత్తేయొద్దని మోదీని కోరారంటూ ఓ వార్తను ప్రచురించింది. ఇది నిజంగా ఆక్షేపిణీయం. స్వార్థ పూరిత అజెండాతో సొంత రాష్ట్ర ముఖ్యమంత్రిని పలుచన చేయాలనుకోవడం నిజంగా దురదృష్టకరం.

మోదీ పై వార్త అలా ఎందుకు….

ప్రధాని నరేంద్రమోదీ సైతం సోమవారం సీఎంల సమావేశంలో జగన్ తరహాలోనే వ్యాఖ్యలు చేశారు. కరోనా ఇప్పట్లో తీరే సమస్య కాదని..ఇంకొన్ని నెలలు ఉంటుందని పేర్కొన్నారు. ప్రాణాలతోపాటు ఆర్ధిక వ్యవస్థనూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కరోనా కేసులు ఆందోళన చెందాల్సిన స్థాయిలో ఏమీ లేవన్నారు. ఇవే వ్యాఖ్యలు కానీ ఏపీ సీఎం జగన్ చేసుంటే ఎల్లో మీడియా రాతలు కోటలు దాటేవనడంలో సందేహం లేదు. జగన్ కు ప్రజల ప్రాణాల కంటే ఆదాయమే ముఖ్యం…కరోనా కేసులు అంత పెద్ద ఎత్తున నమోదవుతున్నా…మరేం పర్లేదంటున్న జగన్ అంటూ తమదైన శైలిలో ఊదరకొట్టేవి ఎందుకంటే వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి  కాగా…చంద్రబాబు నాయుడు ఏపీ ప్రతిపక్ష నేత కాబట్టి….!