iDreamPost
android-app
ios-app

“మహా” ప్రభుత్వంలో విభేదాలు-గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల పంప‌కంలో పంచాయితీ:

“మహా” ప్రభుత్వంలో విభేదాలు-గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల పంప‌కంలో పంచాయితీ:

తేల్చుకుంటామంటున్న కాంగ్రెస్

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ సంకీర్ణ (మహా వికాస్ అగడి) ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య‌ విబేధాలు తలెత్తాయి. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల పంపకంలో పంచాయతీ ఏర్పడింది. ఇప్పటికే పంపకం అయిపోయినా…దాన్ని కాంగ్రెస్ ససేమిరా అంటుంది. మూడు పార్టీలకు సమానంగా పంపాలని, ఒక పార్టీకి ఎక్కువ మరో పార్టీకి తక్కువ వద్దని కాంగ్రెస్ వాదిస్తోంది.

ప్రస్తుత ప‌రిస్థితుల్లో శివసేనకు ఐదు సీట్లు, శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపి)కి నాలుగు, కాంగ్రెస్ కు మూడు సీట్లు పంప‌కాలు జ‌రిగాయి. అయితే మూడు పార్టీల‌కు సమానంగా ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే ఒక్కొపార్టీకి నాలుగు సీట్లతో మూడు పార్టీల‌కు స‌మానంగా పంపిణీ చేయాల‌ని కోరుతుంది. సోమ‌వారం ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో జ‌రిగే  సమావేశంలో ఈ విషయం తేల్చుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి అశోక్ చవాన్ అన్నారు.

రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్ కోట కింద ఖాళీగా ఉన్న 12 ఎమ్మెల్సీ సీట్ల పంప‌కాల‌పై అధికార కూట‌మిలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంతకుముందు అంగీకరించిన సీట్ల పంప‌కంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తారు. ఈ అంశంతో పాటు గవర్నర్‌ కోటాలో శాసన మండలికి నామినేషన్లు, నామినేటెడ్‌ పోస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ బాలా సాహెబ్‌ థోరట్‌, అశోక్‌ చవాన్‌లు సోమవారం ఉద్ధవ్‌ ఠాక్రేతో సంప్రదింపులు జరుపుతారని సమాచారం. 

అలాగే కీలక సమావేశాలకు హాజరయ్యేందుకు తమకు ఆహ్వానం అందడం లేదని కొంత కాలంగా కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ (కోవిడ్‌-19) వ్యాప్తి సహా పలు అంశాలపై చర్చించేందుకు సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే పలుమార్లు ఎన్సీపి చీఫ్‌ శరద్‌ పవార్‌తో సమావేశమవుతుండగా ఈ భేటీలకు కాంగ్రెస్‌ నేతలను పిలవకపోవడంపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. 

మహా వికాస్ అగాడి సంకీర్ణంలో భాగస్వామ్య పక్షాల మధ్య పొరపొచ్చాలపై మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి అశోక్ చవాన్ ఆదివారం స్పందించారు. తమ కూటమి పార్టీల మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి అశోక్‌ చవాన్‌ అంగీకరించారు. విభేదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కావాలని కాంగ్రెస్‌ కోరుతోందని చెప్పారు. మరో రెండు రోజుల్లో సిఎం కాంగ్రెస్‌ నేతలతో సమావేశమవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య కొన్ని అంశాలున్నాయని, అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు తాము సిఎంతో రెండు రోజుల్లో భేటీ అవుతామని అశోక్‌ చవాన్‌ చెప్పారు.                                                                
తమ మధ్య కొన్ని విషయాల్లో స్పర్ధలున్నమాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే సిఎం ఉద్ధవ్‌ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించుకుంటామని ఆయన పేర్కొన్నారు. అయితే మహా వికాస్ అగాఢీలో అధికారులు పుల్లలు పెడుతూ… వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.                                                        
‘‘అవును… కొన్ని విషయాల్లో విభేదాలున్న మాట నిజం. వీటిని సిఎంతో చర్చించుకుంటాం. ముఖ్యమంత్రితో భేటీ కావడానికి ప్రయత్నిస్తున్నాం. ఆయనతోనే అన్నీ కూలంకషంగా చర్చిస్తాం. రెండ్రోజుల్లో సిఎంతో భేటీ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం’’ అని చవాన్ ప్రకటించారు.                                                                                                                                                      
ఇదే విషయంపై పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బాలాసాహెబ్ థోరట్ కూడా స్పందించారు.  ‘‘మా మధ్య ఏవైనా విభేదాలుంటే సంకీర్ణ పక్షాలతో కూర్చొని చర్చించుకుంటాం. కానీ ప్రభుత్వ ప్రధాన భాగస్వామిక నిర్ణయాల్లో మాత్రం కాంగ్రెస్‌కు భాగస్వామ్యం కావాలన్నది మా డిమాండ్’’ అని థోరట్ డిమాండ్ చేశారు.                                      

మే నెలలో శరద్ పవార్ గవర్నర్ తోనూ, ముఖ్యమంత్రితోనూ సమావేశం కావడం… మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంలో త‌మ పాత్ర నామ‌మాత్ర‌మేన‌ని  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తరువాత కూటమిలో భిన్నాభిప్రాయాలు పెరిగాయి. “మేము మహారాష్ట్రలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. కాని మేము మహారాష్ట్రలో కీలక నిర్ణయాధికారం కాదు. మాకు పంజాబ్, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్, పుదుచ్చేరిలోని మాత్ర‌మే నిర్ణయాధికారం ఉంది. ప్రభుత్వాన్ని నడపడం, మద్దతు ఇవ్వడం మధ్య వ్యత్యాసం ఉంది” అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌ పార్టీని ఉద్ధవ్ ఠాక్రే నుండి దూరం చేయడం, మహారాష్ట్రలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం వంటి చ‌ర్య‌ల‌కు హెచ్చ‌రిక‌లు వంటివి.                                                            
అయితే మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ త‌మ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్‌సిపి అధినేత శ‌ర‌ద్ పవార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక‌వైపు కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మ‌రోవైపు పాలక కూటమి అధికారం గురించి మాత్రమే ఆందోళన చెందుతోందని ప్రతిపక్ష బిజెపి ఆరోపిస్తోంది. “మహారాష్ట్ర ప్రస్తుతం చాలా తీవ్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య చైనా కంటే ఎక్కువ. తగిన ఏర్పాట్లు లేని కారణంగా ప్రజలు ఆసుపత్రులలో మరణిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మంత్రులు అధికారం గురించి ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌తో పోరాడాలనే ఉద్దేశ్యంతో వారు ఐక్యంగా ఉంటే మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల మాదిరిగానే పోరాడగలిగి ఉండవచ్చు ” అని బిజెపి సీనియర్ నాయకుడు రామ్‌దాస్ కదమ్ అన్నారు.