Idream media
Idream media
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలను ఈ రోజు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయం పక్కన 10,641 రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. విత్తనాల నుంచి పంట అమ్మకునే వరకూ ప్రతి విషయంలోనూ ఈ రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అండగా ఉంటాయని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.
రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడానికి గల లక్ష్యాన్ని సీఎం జగన్ వివరించారు. రైతులకు సహాయం అందడం, పెట్టుబడి ఖర్చు తగ్గడం, విపత్తు సమయంలో తోడుగా ఉండడం, గిట్టుబాటు ధర కల్పిండం.. అనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందిస్తామని చెప్పారు.
చిత్తశుద్ధితో ఏడాది పాలన సాగించామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ఏడాదిలో 49 లక్షల మంది రైతన్నలకు 10,200 కోట్ల రూపాయలు అందించామని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతం మంది ఆధారపడిన వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. అన్నదాతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనకు ఓటు వేయని వారికి కూడా గౌరవం లభించేలా.. వారి మోముల్లో చిరునవ్వులు ఉండేలా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వానికి.. తన ప్రభుత్వానికి మధ్య పాలన, పథకాలు అందించడంలో వ్యత్యాసాన్ని ప్రజలే గమనించాలని కోరారు.