విశాఖ బయల్దేరిన సీఎం జగన్

విశాఖలోని ఎల్జీ కంపెనీ నుంచి విడుదలైన విషవాయువు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి.. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. కంపెనీ చుట్టుపక్కల సాధారణ పరిస్థితుల్లో తీసుకువచ్చేందుకు రాష్ట్ర, జాతీయ విపత్తు బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే కంపెనీ చుట్టుపక్కల పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

కంపెనీ వద్ద వద్దకు మంత్రి అవంతి శ్రీనివాస్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. నెలలపాటు స్టైరిన్ వాయువు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంచనాకు వచ్చారు.

తాడేపల్లి లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి విశాఖ బయలుదేరారు. అంతకు ముందు ప్రమాద ఘటన, కారణాలు, సహాయక చర్యలపై ప్రధాని నరేంద్ర మోడీ కి వివరించారు. సీఎం జగన్ ప్రమాద స్థలిని పరిశీలించిన తర్వాత.. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రమాద ఘటన, బాధితులకు అందించాల్సిన సహాయం పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Show comments