Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ప్రారంభించారు. లాక్ డౌన్ సమయంలో పేదలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని నిన్నమొన్నటి వరకు డిమాండ్ చేసిన చంద్రబాబు తాజాగా ఆ మొత్తాన్ని పెంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఇవ్వాలని తాజాగా డిమాండ్ చేశారు. నిన్న టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీని స్వాగతించారు.
కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు పూర్తిగా స్తంభించిన విషయం చంద్రబాబుకు తెలియదేమో. 40 ఏళ్ల రాజకీయం అనుభవం, పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు పరిపాలన సాగించాలంటే నిధులు అవసరం అన్న విషయం తెలియదు అనుకుంటా. లాక్ డౌన్ వల్ల మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు రూపాయి ఆదాయం రాలేదు. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు నానా తంటాలు పడుతున్నాయి.
పలు ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించగా మరి కొన్ని ప్రభుత్వాలు వాయిదాల రూపంలో చెల్లించేందుకు సిద్ధమయ్యాయి.
తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి వినతులు సమర్పించాయి. ఇలాంటి పరిస్థితుల్లో 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతిస్తారు అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంలో దేశంలోనే సీనియర్ రాజకీయవేత్త అయిన నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని తనకన్నా జూనియర్ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిధులు ఇవ్వాలని అడిగితే రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేసినవారవుతారు.
ఇలా చేస్తే దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబుకు కృతజ్ఞతులై ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం చేయిస్తారేమోనన్న ఆశతో రాష్ట్ర ప్రజలు తో పాటు దేశ ప్రజలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఇప్పిస్తే దేశం మొత్తానికి మేలు చేసినవారవుతారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో దేశంలోనే సీనియర్ అయినా చంద్రబాబు యావత్ దేశం తరఫున కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆర్థిక సహాయం అందించి పుణ్యం కట్టుకోవాలి అని ప్రజలు ప్రార్థిస్తున్నారు. దీని వల్ల చంద్రబాబు కు ఎంతో ప్రయోజనం ఉంది. భవిష్యత్ లో చిన బాబు ను ఏపీ సీఎం ను చేసి.. తాను ప్రధాన మంత్రి కావొచ్చు.