Idream media
Idream media
రెండు నెలల తర్వాత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి స్వరాష్ట్రానికి వచ్చారు. కాన్వాయ్‌తో రాష్ట్ర సరిహద్దుల్లో అడుగుపెట్టగానే టీడీపీ శ్రేణులు భారీగా జాతీయ రహదారిపైకి వచ్చి స్వాగతం పలికాయి. రోడ్డుపై టీడీపీ జెండాలతో వేచి ఉన్న టీడీపీ శ్రేణులను చూడగానే చంద్రబాబు కారును ఆపారు. డోర్‌పై నిలబడి తనదైన శైలిలో అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు తనకు స్వాగతం పలకడంతో బాబు సంతోషంగా ఉన్నట్లు ఆ వీడియో ఆయన హావాభావాలు బట్టి అర్థం అవుతోంది.
నాయకుడు రావడం, స్వాగతాలు, జేజేలు పలకడం సర్వసాధారణం. అయితే ప్రస్తుత కరోనా సమయంలో చంద్రబాబు ఇలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. లాక్‌డౌన్ అమలులో ఉంది. కరోనా కట్టడికి మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి. అదే విధంగా 50 మందికి మించి గూమిగూడకూడదు. కానీ చంద్రబాబు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన టీడీపీ శ్రేణులు మాస్క్ ధరించకపోగా.. కరచాలనం కోసం ఎగబడినట్లు తోసుకుని ఉన్నారు.
పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్ల లోపు వృద్ధులు కరోనా నుంచి అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు చెబుతున్నాయి. అందుకే ప్రయాణాల్లోనూ అత్యవసరం అయితేనే పిల్లలు, వృద్ధులను అనుమతిస్తున్నారు. ఇలాంటిది 70 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు.. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ బాబు ఇలాంటి జాగ్రత్తలేమీ పాటించడంలేదని తెలుస్తోంది. బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులన్న వారికి వైరస్ సోకితే.. కోలుకోవడం కష్టమని చరిత్ర చెబుతోంది.
లాక్‌డౌన్ కష్టకాలంలో తమ నియోజకవర్గ ప్రజలకు నిత్యవసరాలు, కూరగాయలు పంపిణీ చేసి అండగా ఉన్నామని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యేలపై లాక్‌డౌన్ నిబంధనలు పాటించడంలేదంటూ విమర్శలు చేసిన చంద్రబాబు, అండ్ కో ఇప్పుడు ఏమి చేసిందనే ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. చెప్పేందుకే నీతులు.. అన్నట్లుగా బాబు తీరు ఉందని విమర్శిస్తున్నాయి. సహాయం చేసిన ఎమ్మెల్యేలపై కోర్టులలో పటిషిన్ దాఖలు చేయడం, దాన్ని ధర్మాసనం విచారణకు స్వీకరించడంతోపాటు.. ప్రజా ప్రతినిధులే లాక్‌డౌన్ నిబంధనలు పాటించపోతే ఎలా..? అంటూ వ్యాఖ్యానించడం ఇప్పటి వరకూ జరిగింది. అంతేకాదు లాక్‌డౌన్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ ఎందుకు వేయకూడదంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
మరి ఇప్పుడు సహాయం చేసేందుకు కాకుండా.. తన స్కోత్కర్ష కోసం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన చంద్రబాబుపై ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేస్తారేమో చూడాలి. ఆయనపై కూడా హైకోర్టు వైసీపీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలనే చేస్తుందా..? అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు కరోనాను వ్యాపింపజేస్తున్నారని, కరోనా క్యారియర్లని విమర్శించిన టీడీపీ నేతలు.. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే విమర్శలకు ఏమని సమాధానం చెబుతారో..? చంద్రబాబు వ్యవహారాన్ని ఎలా సమర్థించుకుంటారో చూడాలి.