iDreamPost
android-app
ios-app

కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ మార్గాన్ని అనుసరిస్తున్న కేంద్రం.

  • Published Jun 09, 2020 | 5:29 AM Updated Updated Jun 09, 2020 | 5:29 AM
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ మార్గాన్ని అనుసరిస్తున్న కేంద్రం.

కరోనా మహమ్మారి రోజు రోజుకి భారత్ దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే దేశంలో వ్యాధి సోకిన వారి సంఖ్య 2,56,611 కి చేరుకోగా అందులో 7,135 మంది చనిపోయారు. ఇక వ్యాధి నుండి బయటపడినవారి సంఖ్య చూస్తే 1,24,095 గా ఉంది. ప్రస్తుతానికి ప్రపంచంలో కరోనా కేసుల విషయంలో భారత్ 5వ స్థానంలో ఉన్నా త్వరలోనే అది 4వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక రాష్ట్రాల వారిగా చూస్తే దేశంలోని 10 రాష్ట్రాల్లో ఉన్న 38 జిల్లాల్లో ఈ కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ మరింత తీవ్రంగా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యాన, గుజరాత్, జమ్మూకాశ్మీర్, కర్నాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లో ఉన్న జిల్లాల్లో రోజు రోజుకి వ్యాధి తీవ్రత పెరిగిపోతుంది, మహారాష్ట్ర లో వ్యాధి సోకిన వారి సంఖ్య ఏకంగా చైనా దేశాన్ని దాటి 85,975 గా నమొదయింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం సదరు 10 రాష్ట్రాల్లో ఉన్న 38 జిల్లాల్లో తక్షణం ఇంటింటి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 

అయితే ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుగా మేలుకుని వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లతో రాష్ట్రంలో ఇంటింటికి సమగ్ర సర్వే నిర్వహించి సత్ఫలితాలు సాధించింది. దీంతో ఇప్పటికే  రాష్ట్రంలో 4,63,463 టెస్టులు చేయగా యాక్టివ్ గా ఉన్న కేసులు 1381 గా , వ్యాధి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయిన వాళ్ళు 2387 కాగా చనిపోయిన వారు 75గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రికవరి 45% గా ఉండగా భారత్ లో అది 48% , ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు వచ్చేసరికి అది 69% గా నమోదయింది. కరోనా కట్టడికి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగ్గా పనిచేస్తుంది అని ఇప్పటికే పలు ఆరోగ్య సంస్థలు కూడా ప్రకటించాయి.

ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ఇచ్చిన సలహా మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి దేశంలో ఉన్న రాష్ట్రాలని, అందులో ఉన్న జిల్లాలని జోన్లు వారిగా విభజించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముందు చూపుతో తెప్పించిన కొరియా టెస్టింగ్ కిట్లను అన్ని రాష్ట్రాల వారు విరివిగా వాడి అధికంగా టెస్టులు చెయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రాష్ట్రంలో మార్చి నెలనాటికే నిర్వహించిన ఇంటింటి సర్వేను ఇప్పుడు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచింది. ఏది ఏమైనా కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుసరించిన విధానాలే దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణం.