కరోనా ఎఫెక్ట్‌.. రాజకీయం తలకిందులు..

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మరి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవగా.. కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లతో సామాజిక వ్యవస్థ స్తంభించింది. తాజాగా రాజకీయ వ్యవస్థపై కూడా కరోనా వైరస్‌ ప్రభావం పడింది. దేశ రాజకీయాలు బంద్‌ అవుతున్నాయి.

పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా..

వచ్చే నెల 4వ తేదీ వరకు జరగాల్సిన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు నిన్నటితో అర్థంతరంగా ముగిశాయి. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తాజా నిర్ణయంతో ఎంపీలు తమ నియోజకవర్గాల బాట పట్టనున్నారు. కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎంపీలకు ప్రధాని మోదీ సూచించారు. ఇకపై వారు ఆ పనిలో ఉండే అవకాశం ఉంది.

రాజ్య సభ ఎన్నికలు వాయిదా..

రాజ్యసభలో పెద్దల ఎంట్రీపై కూడా కరోనా ప్రభావం పడింది. ఈ నెల 26వ తేదీన 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరు ఏకగ్రీవం కాగా, ఏపీలో నాలుగు స్థానాలకు ఐదుగురు బరిలో ఉండడంతో ఎన్నికలు అనివార్యమైంది. అయితే కరోనా వైరస్‌ ప్రభావంతో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మంగళవారం ప్రకటించింది.

ఏపీ బడ్జెట్ సమావేశాల పరిస్థితి ఏమిటో..?

ఏపీ విషయాన్నికి వస్తే.. 2020–21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను శాసన సభ ఆమోదించుకోవాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో సమావేశౠలు ఈ నెలాఖరున నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే కరోనా వైరస్‌ ప్రభావంతో ఎన్నికలు వాయిదా పడడంతో ఈ నెల 27వ తేదీన సమావేశాలు నిర్వహించాలని నిర్నయించారు. 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు నిర్వహించిన తర్వాత మరుసటి రోజే బడ్జెట్‌ సమావేశాలు జరపాలని భావించారు.

ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు వాయిదా పడడంతో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించకపోతే ఓట్‌ ఆయన్‌ అకౌంట్‌కు వెళ్లాల్సిన వస్తుంది. తప్పని సరి పరిస్థితుల్లో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని లాక్‌డౌన్‌ ప్రకటన రోజున సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన నేపథ్యంలో సమావేశాలు జరిగే అవకాశం ఉంది.

ఏపీ మండలి రద్దు.. వాయిదా..

పార్లమెంట్‌ ఉభయ సభలు అర్థాంతరంగా వాయిదా పడడంతో ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపై పడిందని చెప్పవచ్చు. పార్లమెంట్‌ వాయిదా పడడంతో ఏపీ శాసన మండలి రద్దు కూడా వాయిదా పడింది. ఈ సమావేశాల్లోనే మండలి రద్దుకు ఆమోదం పడుతుందని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ భావించింది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో సంప్రదింపులూ జరిపారు. అవన్నీ కరోనా వైరస్‌ కారణంగా నిష్ఫలమయ్యాయి. కరోనా వైరస్‌ వల్ల ఏపీ మండలి మరికొన్ని నెలలు సజీవంగా ఉండనుంది. ఈ పరిణామం మండలి రద్దును వ్యతిరేకిస్తున్న టీడీపీకి ఉత్సాహానిస్తుందని చెప్పవచ్చు.

Show comments