iDreamPost
android-app
ios-app

రేపే మాచర్ల వస్తా.. చూసుకుందాం.. రా..

రేపే మాచర్ల వస్తా.. చూసుకుందాం.. రా..

గుంటూరు జిల్లా మాచర్లలో స్థానిక ఎన్నికలు పర్యవేక్షణకు వెళ్లి దాడికిగురైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కొద్దిసేపటికి క్రితం అమరావతిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం చంద్రబాబుతో కలసి వారు మీడియాతో మాట్లాడారు. తమను చంపేందుకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్లాన్‌ చేశారని బొండా ఉమా ఆరోపించారు. తమకు ప్రాణ హాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై బొండా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సవాల్‌ విసిరారు. ‘‘ నువ్‌ చంపుతావుంటే మేము పారిపోతామా..? ఎవడ్ని చంపుతావురా..? రేపు నీ ఊరికే వస్తా.. దమ్ముంటే రా.. నాయాల.. కొ..లా నిరాయుధులైన మాపై కాదు..రేపు రా.. అక్కడే చూసుకుందా..’’ అంటూ సవాల్‌ విసిరారు. మా రక్తం కళ్ల చూశారని బొండా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లలు పుణ్యఫలం వల్ల తాను ప్రాణాలతో బయటపడ్డామన్నారు. తన వాహనంపై కత్తులు, గొడ్డళ్లు, రాళ్లు, కర్రలు విసిరారని చెప్పారు. గొడ్డళ్ల దెబ్బలు తన కారు డోరుకు తగిలాయన్నారు.

తనను కర్రతో పొడిచారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చెప్పారు. తనకు చేయి వాచిపోయిందన్నారు. తనకు తగిలిన దెబ్బలను చూపించారు. జగన్‌ హంతకుడు, దోపిడీ దారుడని, చేతకాని దద్దమ్మవని విమర్శించారు. అధికారంతో విర్రవీగే వారు ఎవరూ ఈ భూమిపై బతికి బట్టకట్టలేదని శాపనార్థాలు పెట్టారు. పిల్లలను తమ కారుతో ఢీ కొట్టామని చెప్పడం అవాస్తమన్నారు. ఈ ఘటనపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.