iDreamPost
android-app
ios-app

ఏపీ లాక్‌ డౌన్‌.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటన…

ఏపీ లాక్‌ డౌన్‌.. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటన…

కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెల 31వ తేదీ వరకు ఏపీని లాక్‌ డౌన్‌ చేస్తున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ నియంత్రణపై సీఎం వైఎస్‌ జగన్‌ కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయని తెలిపారు.

లాక్‌డౌన్‌ అయిన నేపథ్యంలో పేదలు, బడుగువర్గాల వారికి బియ్యం ఉచితంగా ఇస్తామని తెలిపారు. కిలో కందిపప్పు, రేషన్‌కార్డు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ఇస్తామన్నారు. ఏప్రిల్‌ 4వ తేదీన వాలంటీర్లు ఈ మొత్తం పంపిణీ చేస్తారని తెలిపారు.

రాష్ట్రంలో ఆరు కేసులు నమోదవగా అందులో ఒకరికి పూర్తిగా నయమైందని సీఎం చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్‌ వార్డులు, జిల్లా కేంద్రంలో 200 పడకలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన 11670 మందిని గుర్తించామని తెలిపారు. వీరిలో 10,091 హోం క్వారంటైన్‌లో, 24 మంది ఆస్పత్రిలో, మిగతా వారిని హోం ఐసోలేషన్‌లో పెట్టామని సీఎం తెలిపారు.

ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావలని కోరారు. వచ్చినప్పుడు ఇతరులకు కనీసం రెండు మీటర్ల దూరంలో ఉండాలన్నారు. 10 మందికి మించి ఎవరూ గూమికూడవద్దని తెలిపారు. 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులను బయటకు వెళ్లవద్దని సీఎం సూచించారు.

14 రోజులపాటు విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతున్నామని, ఆ తర్వాత వైరస్‌ నశిస్తుందనే భావనలో ఉన్నామన్నారు. అందుకే ఈ లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌ డౌన్‌ చేసిన తర్వాత ఏమి చేయాలన్నదని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. కేంద్రం సూచనలు తీసుకుని 31వ తేదీ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటామో తెలియజేస్తామన్నారు.

నిత్యవసరాలు, అత్యవసర వస్తువుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. సరుకులు, కూరగాయలు, ఇతర అత్యవసర వస్తువులు ఎంత ధరకు అమ్మాలన్నది కలెక్టర్లు నిర్ణయించి ప్రకటిస్తారని తెలిపారు. ఆ ధరలకు మించి ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ ఫ్రి నంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధరల ప్రకటనతోపాటు ఆ టోల్‌ ఫ్రి నంబర్‌ కూడా వెల్లడిస్తామన్నారు.

పొలం పనులుకు వెళ్లే వారికి మినహాయింపు ఇస్తున్నామన్నారు. పొలంలో పనులు చేస్తున్న సమయంలో కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలని చెప్పారు. అత్యవసర సేవలు, వస్తువుల దుకాణాలు అందుబాటులో ఉంటాయని, ఆయా దుకాణాలు తెరిచే ఉంటాయని చెప్పారు.

కరోనా వైరస్‌ గురించి ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు ప్రపంచ వ్యాప్తంగా 80 శాతం మంది ఇళ్లలోనే ఉంటున్నారని, వారికి నయమవుతోందన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో కేవలం ఒకట్రెండు శాతం మరణాలు మాత్రమే సంభవిస్తాయన్నారు. అందులోనూ వృద్ధులు మాత్రమే హాని జరుగుతుందని చెప్పారు. పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.