Idream media
Idream media
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఊపందుకునేది. విమర్శలు, ప్రతివిమర్శలు, డబ్బుల పంపిణీలతో రాజకీయం వేడెక్కేది. అయితే పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఎన్నికలపై స్టే ఇచ్చి, ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ధైర్యం ప్రభుత్వానికి లేకపోవడంతోనే రిజర్వేషన్లను పెంచి, కోర్టులో వైఎస్సార్‌సీపీ కేసు వేసిందని తెలుగుదేశం ఆరోపణలు చేస్తూ వస్తోంది. ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగేందుకు ముఖం చెల్లకే టీడీపీనే తన మనుషులతో కేసులు వేయించిందని వైఎస్సార్‌సీపీ విమర్శలు చేస్తూ వస్తోంది.
దీనికి బలం చేకూరుస్తూ కోర్టులో కేసు వేసిన వారిలో ఒకరైన బిర్రు ప్రతాప్‌రెడ్డికి టీడీపీతో గల సంబంధాలను వైస్సార్‌సీపీ నాయకులు బయటపెట్టారు. చంద్రబాబుతో ప్రతాప్‌కు గట్టి సంబంధాలు ఉన్నాయంటూ ఫొటోలను సైతం విడుదల చేశారు. అలాగే ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఎన్నికలకు వెళ్లే ధైర్యముంటే వెంటనే టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డితో పిల్‌ను ఉపసంహరింపజేయాలని సవాల్ విసిరారు. బీసీలకు రిజర్వేషన్లను కల్పించడం బాబుకు ఇష్టం లేదని, అందుకే నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఎన్నికలకు టీడీపీ ఎందుకు భయపడుతోంది?
రాష్ట్రంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా కేవలం అమరావతి ప్రాంతం గురించి మాత్రమే చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతుంటుండడంతో ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ప్రజలకు మొహం చూపించలేకపోతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అమ్మ ఒడి కింద తల్లులకు రూ. 15వేలు ఇవ్వడం, చేనేతలకు రూ. 24 వేల ఆర్థిక సాయం, రైతు భరోసా పూర్తిగా చెల్లించడం లాంటివన్నీ పూర్తిస్థాయిలో జరగడంతో టీడీపీ జంకుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు వెళ్తే ఘోరంగా దెబ్బతినాల్సి వస్తుందని టీడీపీ సీనియర్లు చెప్పడంతో పరోక్షంగా కేసులు వేయించి ఎన్నికలను కొన్ని వాయిదా వేయించాలని ప్రయత్నం చేశారు. ఆ మేరకు కొద్దిగా విజయవంతం కూడా అయ్యారు.
నేటి తీర్పులో ఏముందో?
కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. 59.85 ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా? లేక 50 శాతానికి తగ్గించాలా? అనేది తేలనుంది. తీర్పు ఏ విధంగా వచ్చినా సర్వసన్నద్ధంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ నాయకులకు అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.