బంతి బీజేపీ కోర్టులోకి..!

ఏపీ వ్య‌వ‌హారాల్లో కేంద్రం కీల‌కం కాబోతోంది. రాజ‌ధాని అంశంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలు ప్ర‌భావితం చేయ‌డంతో మండ‌లి ర‌ద్దు ముంగిట‌కు చేరింది. ఏపీ క్యాబినెట్ తీర్మానం చేయ‌డం, ఆ వెంట‌నే అసెంబ్లీ ఆమోదం అనివార్యంగా భావిస్తున్నారు. ఆ వెంట‌నే వ్య‌వ‌హారం హ‌స్తిన చేరుతుంది. మోడీ-షా నిర్ణ‌యాల‌కు అనుగుణంగా అనంత‌ర ప‌రిణామాలుంటాయి.

మండ‌లి ర‌ద్దు వెంట‌నే జ‌ర‌గ‌ద‌ని, దానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే గ‌తంలో ఉన్న అనుభ‌వాల రీత్యా కేంద్రం త‌ల‌చుకుంటే వెంట‌నే ఆ ప్ర‌క్రియ ముగిసిపోయే అవ‌కాశం లేక‌పోలేదు. గ‌తంలో ఎంజీఆర్ ప్ర‌భుత్వం త‌మిళనాడులో మండ‌లి ర‌ద్దు చేయాల‌నే నిర్ణ‌యం తీసుకున్న వెంట‌నే మూడు నెల‌ల‌కే మండలి మ‌నుగ‌డ కోల్పోయింది. ఇప్పుడు కూడా కేంద్ర బీజేపీ పెద్ద‌లు స‌హ‌క‌రిస్తే ఏపీలో శాస‌న‌మండ‌లికి స్వ‌ల్ప‌కాలంలోనే సెల‌వు ఇచ్చేసే అవ‌కాశం ఉంది.

Read Also: టీడీపీ ఎమ్మెల్సీలకు బీజేపీ గాలం.. ?

పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సిద్ధ‌మ‌వుతోంది. రెండు విడ‌త‌లుగా ఈ స‌మావేశాలు జ‌రుగుతాయి. దాంతో మార్చి నెల‌లో జ‌రిగే స‌మావేశాల్లో ఏపీ అసెంబ్లీ తీర్మానాన్ని పార్ల‌మెంట్ దృష్టికి తీసుకెళితే ఆమోదం పెద్ద స‌మ‌స్య కాబోదు. అందుకు బీజేపీ పెద్ద‌ల సంసిద్ధ‌త కీల‌కం. దాంతో అంద‌రి దృష్టి కేంద్రంపై ప‌డింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని మోడీ సంపూర్ణంగా అంగీక‌రిస్తార‌ని, వ్య‌క్తిగ‌తంగా మండ‌లి వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకి అయిన మోడీ మ‌ద్ధ‌తుతో పార్ల‌మెంట్ లో ఆమోదం పెద్ద క‌ష్టం కాబోద‌ని కొంద‌రు చెబుతున్నారు.

Read Also: రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు బ్రేక్ – అనుకున్నది సాధించిన టీడీపీ

ఏపీ ప్ర‌భుత్వం ఆశించిన‌ట్టుగా జ‌రిగితే కనీసంగా ఏప్రిల్ చివ‌రి నాటికి శాస‌న‌మండ‌లికి ముగింపు జ‌రుగుతుంది. దాంతో మే నెల నాటికి రాజ‌ధాని వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. త‌ద్వారా ఇప్ప‌టికే గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో పేర్కొన్న‌ట్టుగా కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానిగా విశాఖ నుంచి కార్య‌క‌లాపాలు ప్రారంభ‌మ‌వుతాయి. అది ఉద్యోగుల‌కు కూడా వారి పిల్ల‌ల విద్య‌కు సంబంధించిన ఆటంకాలు లేకుండా చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీ ప్ర‌భుత్వం స్పంద‌న ఏమిటి..ఎప్ప‌టికి మండ‌లి బిల్లుకు ఆమోదం ద‌క్కుతుంద‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం.

Show comments