iDreamPost
android-app
ios-app

డాక్టర్‌ సుధాకర్ కేసు – సుప్రిం కోర్టుకు ఏపీ సర్కార్‌..?

డాక్టర్‌ సుధాకర్ కేసు – సుప్రిం కోర్టుకు ఏపీ సర్కార్‌..?

విశాఖ మత్తు డాక్టర్‌ సుధాకర్‌ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన రాష్ట్ర హైకోర్టు నిర్ణయాన్ని సుప్రిం కోర్టులో సవాల్‌ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తోంది. సుధాకర్‌ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే సమయంలో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. సుధాకర్‌ ఘటనలో ప్రభుత్వం చేసే దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించింది. సుధాకర్‌ ఘటన దర్యాప్తును సీబీఐకి ఇవ్వడంపై అందరూ ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

తాగిన మైకంలో సుధాకర్‌ ప్రధాని, ముఖ్యమంత్రులను దూషించడం, కొన్ని మతాల వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ రోడ్డుపై హల్‌చల్‌ చేస్తుండడంతో స్థానికుల సమాచారం మేరకు ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వెలుగుచూశాయి. అయితే డాక్టర్‌ సుధాకర్‌పై అమానుషంగా ప్రవర్తించారంటూ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు తీర్పుపై వైసీపీ నేతలు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. అమరావతి భూ కుంభకోణం, పుష్కరాల తొక్కిసలాట.. ఇలా చంద్రబాబు హయాంలో జరిగిన అనేక సంచలన ఘటనలపై లేని దర్యాప్తు చిన్న పెట్టి కేసు అయిన సుధాకర్‌ విషయంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై పలు వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తూ తాజాగా ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. వైసీపీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తో సహా మొత్తం 49 మందికి నోటీసులు జారీ చేయడం గమనార్హం.