స్థానిక ఎన్నికలు వాయిదా పడటం మరియు కరోనా నివారణ చర్యలపై చర్చకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వ భూషణ్ తో భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో పలు విషయాలను గవర్నర్ తో సీఎం జగన్ చర్చించారు.
మరి కొద్దిసేపట్లో సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కాగా గవర్నర్ తో భేటీ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారని,ఎన్నికల కమిషనర్ పై గవర్నర్ కు సీఎం జగన్ ఫిర్యాదు చేసారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలను ఆరువారాలకి వాయిదా వేస్తున్నామని ఎన్నికల కమీషన్ ప్రకటించింది. గుంటూరు, చిత్తూరులో జరిగిన హింసాత్మక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటుకు సిఫార్సు చేశారు. తిరుపతి, మాచర్ల, పుంగనూరులో ఘర్షణలపై విచారణకు ఆదేశించారు. ఘర్షణలు నెలకొన్న మూడు చోట్ల కొత్త షెడ్యూల్‌కు వెనకాడబోమని కమీషనర్ హెచ్చరించారు.
ఎన్నికల కమీషనర్ తీసుకున్న ఈ నిర్ణయాలపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహంగా ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో స్థానిక సంస్థలకు కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోతాయని గవర్నర్ కు జగన్ వివరించినట్లు సమాచారం. స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో జగన్ ఏవిధంగా స్పందిస్తారనేది ,మరికొద్దిసేపట్లో జగన్ నిర్వహించబోయే ప్రెస్ మీట్లో తెలుస్తుంది.