మరో 5వేల మందికి అదనంగా రూ. పదివేల పరిహారం!!

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు అందించే పరిహారం పరిధిని రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతోంది. అస్వస్థతకు గురైన ప్రభావిత గ్రామాలనే కాకుండా, పక్క ప్రాంతాలనూ ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే 12 మంది మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున, చికిత్స తీసుకున్న వారికి రూ. 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రభుత్వం పరిహారం అందించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందిన వారికి పది లక్షలు ఇచ్చారు. బాధిత ప్రాంతాలైన వెంకటాపురం, కంపరపాలెం, పద్మనాభనగర్, నందమూరునగర్, ఎస్‌సీబీసీ కాలనీల్లోని దాదాపు 15వేల మందికి ఒక్కొక్కరికి రూ. పది వేల చొప్పున పరిహారం అందించనుంది. వీటితో పాటు కంపెనీకి కాస్త దూరంగా ఉన్న జనతాకాలనీ, మేఘాద్రిపేట కాలనీ, పైడిమాంబకాలనీ, ఆర్‌ఆర్‌వీ పురం, అజంతాపార్క్, టైలర్స్‌ కాలనీ, బాపూజీ నగర్, వుడా కాలనీ, శ్రీరామ్‌ నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ బ్లాక్, శ్రీనుబాబు నగర్, రజకుల కాలనీ, శ్రీరామ్‌ నగర్, నార్త్‌ క్వార్టర్స్‌ ప్రాంతాల్లోనూ పరిస్థితిపై సర్వే చేయాలని సీఎం ఆదేశించడంతో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 6,297 గృహాలను పూర్తిగా సర్వే చేసి 20,574 మంది జనాభా ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా మరో 5 వేల మందికి అదనంగా పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాంతాల్లో పాలిమర్స్‌ ప్రభావంపై వైద్యుల సూచనల మేరకు పరిహారం అందించనున్నారు.

అందరూ డిశ్చార్జ్‌..

ఆస్పత్రిలో చేరిన దాదాపు 585 మంది బాధితులందరికీ అత్యున్నత స్థాయి వైద్యం అందించిన వైద్యాధికారులు వారిని డిశ్చార్జి చేశారు. బాధిత గ్రామాల్లో క్లినిక్‌లను ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయి శానిటైజేషన్‌ చేయడంతోపాటు ప్రజలకు భరోసా ఇచ్చేందుకు మంత్రులు, ఎంపీలు ఆయా గ్రామాల్లో బస కూడా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ చర్యలతో బంధువుల ఇళ్ల వద్ద, రిలీఫ్‌ క్యాంపుల్లో తలదాచుకుంటున్న వారందరూ ఇంటికి చేరుకుంటున్నారు.

విశాఖలోని కంపెనీలన్నింటిలోనూ తనిఖీలు..

ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీకేజీ ఘటనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పారిశ్రామిక విశాఖలో ఇలాంటివి పునరావృతం గాకుండా తనిఖీలు చేయడానికి ప్రత్యేక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రమాదకరమైన రసాయనాలను, గ్యాస్‌ వినియోగించే 19 పరిశ్రమలను ప్రాథమికంగా గుర్తించారు. ఆయా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించి సత్వరమే నివేదికలు ఇవ్వాలని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పరిశ్రమలు, బాయిలర్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ఇండస్ట్రీస్‌ ప్రతినిధులు, అధికారులు, ప్రొఫెసర్లతో నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు వీటిని సమన్వయం చేయనున్నారు. సాంకేతిక నిపుణుల సహకారం తీసుకోనున్నారు.

Show comments